ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
కమలాపూర్: ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కమలాపూర్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే సాహసం చేయలేదని, మొన్నటి వరకు నిరుద్యోగ యువకులను ఇబ్బంది పెట్టి, ఉపాధ్యాయులకు డీఏలు ఇవ్వకుండా, 317 జీఓ సవరించకుండా, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టిన ఆ పార్టీకి పోటీ చేసే ముఖం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా 15 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక ముఖం చాటేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని నేరుగా పోటీలో నిలపలేదన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, నాయకులు శ్రీరాం శ్యాం, కొండం శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, శోభన్, కనుకుంట్ల అరవింద్, చేలిక శ్రీనివాస్, భూపతి ప్రవీణ్, సతీష్, రత్నాకర్, వినయ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
జబ్బాపూర్ ఘటన దురదృష్టకరం
గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం జబ్బాపూర్‌లో శివాజీ జయంతి సందర్భంగా జెండా ఎత్తుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందడం, మరొకరు సీరియస్‌గా ఉండటం, మరో ఎనిమిది మంది గాయపడటం దురదృష్టకరమని ఈటల అన్నారు. మృతిచెందిన లింగ ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, సీరియస్‌గా ఉన్న కరుణాకర్‌కు అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామని ఈటల తెలిపారు.
శివాజీ విగ్రహావిష్కరణ
మండలంలోని శంభునిపల్లి, నేరెళ్ల గ్రామాల్లో బుధవారం నిర్వహించిన చత్రపతి శివాజీ 395వ జయంతి ఉత్సవాల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొల్పిన శివాజీ విగ్రహాలను ఆవిష్కరించారు. కమలాపూర్‌లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఆరె సంక్షేమ సంఘం నాయకులు కోలె దామోదర్‌రావు, భావని రాజేశ్వర్‌రావు, సత్యరాజ్, సాంబరావు, మోకిడె ప్రసాద్, కొండం శ్రీనివాస్ యాదవ్, సామ్రాజ్యంగౌడ్, కట్కూరి అశోక్‌రెడ్డి, అరె సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, కులస్తులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులను నిలిపే ముఖం లేదు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment