వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు..
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఒగ్గు పూజారుల మేలు కొలుపుతో స్వామి వారు మేల్కోగా అర్చకులు వేదమంత్రాలతో నిత్య పూజలు నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం ఉత్సవ మూర్తులతో సూర్యప్రభ వాహనసేవ నిర్వహించగా ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ,వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మాడవీధుల్లో భక్తులకు దర్శనం గావించారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ కరణ, దీక్షాధారణ, అఖండ దీప స్థాపన, అస్తరాజా ర్చన, బలిహరణతో ఉదయం పూజలు పూర్తిచేశారు. సాయంత్రం మృత్ సంగ్రహణ, అంకురార్పణ, అగ్ని మదన–అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ధ్వజారోహణంతో ప్రారంభం
నూతన వస్త్రంపై నందీశ్వరుడి చిత్రాన్ని లిఖించారు. ఆ వస్త్రాన్ని మల్లికార్జున స్వామివారి ధ్వజస్తంభ శిఖరాగ్రాన ఎగురవేశారు. అర్చకులు దీనిని ద్వజారోహణం అంటారు. నందీశ్వరుడు తన ప్రభువైన మల్లికార్జునుడికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వ లోకాల్లోని సకల దేవతాగణాలు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు ఆ సమయంలో వేదపండితులు మంత్ర పఠనం చేశారు. దీంతో బ్రహ్మోత్సవ జాతర ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. అనంతరం రాత్రి చంద్రప్రభ వాహనసేవ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్‌తో పాటు అర్చకులు నందనం భానుప్రసాద్ శర్మ, నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్‌శర్మ, ఉప్పుల శ్రీనివాస్, దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మొదటి రోజు ఉదయం
సూర్యప్రభ వాహనసేవ
Comments
Please login to add a commentAdd a comment