
ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా సహకరించాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
హన్మకొండ అర్బన్: పరకాల నియోజకవర్గ యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా అధికారులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ట్రైనింగ్ సెంటర్లు, పాల డెయిరీల ఏర్పాటులో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలో మహిళలు, యువత ఉపాధి సాధించేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు కుట్టు శిక్షణ, ఇతర సాంకేతిక పథకాలను విస్తృతంగా అందించాలని సూచించారు. రైతులతో ఏర్పాటైన సొసైటీలను ప్రోత్సహించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 4న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేళాకు 50కి పైగా.. ప్రముఖ సంస్థలు, కంపెనీలు హాజరుకానున్నట్లు నియోజకవర్గ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా సహకరించాలి