నగరాభివృద్ధికి సహకరించాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : ఆస్తి, నల్లా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ గుండు సుధారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పన్నుల వసూలు, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని, రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించారు. ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.118.06 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.60.17 కోట్లు వసూలయ్యాయని, కేవలం పక్షం రోజుల సమయమే మిగిలి ఉన్నదని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి లక్ష దరఖాస్తులు రాగా 14,088 మంది క్రమబద్ధీకరించుకోవడానికి ఫీజులు చెల్లించారని, 680 మందికి క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలు అందజేసినట్లు చెప్పారు. 25శాతం రిబేట్‌తో ఈనెల 31లోపు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరించుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. రంజాన్ పండుగ ఏర్పాట్లు విస్త్రతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, రాజేశ్వర్, టాక్సేషన్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.