వరంగల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షలు గురువారం ముగిసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి ప్రథమ సంవత్సరం, 6 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4,967 మంది విద్యార్థులు, ఒకేషనల్ 848 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5,739 మంది, ఒకేషనల్ 767 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల, కార్యాలయ సిబ్బంది రాజశేఖర్, కొలంబో తదితరులు పరీక్షలను పర్యవేక్షించారని వివరించారు.
మరియపురం
అభివృద్ధిపై ప్రశంసలు
గ్రామంలో రాజస్తాన్ ప్రతినిధుల పర్యటన
గీసుకొండ: మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురాన్ని రాజస్తాన్ రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం గురువారం సాయంత్రం సందర్శించింది. రాజస్తాన్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 21 మందితో కూడిన బృందం టీజీఐఆర్‌డీ సీడీపీఏ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధిని పరిశీలించి ప్రశంసించింది. మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆధ్వర్యంలో గణనీయమైన అభివృద్ధి సాధించి రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకుందని అధికారులు వారికి వివరించారు. అలాగే, పల్లెప్రకృతి వనం, కిచెన్‌గార్డెన్, బోరురీచార్జ్, మ్యాజిక్ సోప్‌పిట్లను పరిశీలించి గ్రామాభివృద్ధి బాగుందని కొనియాడారు. బృందంలోని రాజస్తాన్ సర్పంచ్ రమన్‌దీప్ కౌర్ జన్మదినం సందర్భంగా గ్రామస్తులు, అధికారులు ఆమెతో కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు. డీపీఓ కటకం కల్పన, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఎంపీడీఓ వి.కృష్ణవేణి, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి, ఫ్యాకల్టీ ప్రతినిధి కర్ణాకర్, ఏపీఎం చంద్రకాంత్, ఎన్‌ఐఆర్‌డీ ప్రతినిధి శేఖర్, పంచాయతీ కార్యదర్శులు సరిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలను
నిలిపివేయాలి
నర్సంపేట: ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేసిన సంఘటన నర్సంపేటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 121 సర్వేనంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని దళిత సంఘాల నాయకులు కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ నిర్మాణాలు జరుగుతుండడంతో సమీపకాలనీ వాసులు, దళిత సంఘాల నాయకులు పెట్రోల్‌బాటిళ్లు పట్టుకొని పట్టణంలోని మోడల్ స్కూల్ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకుపై ఎక్కారు. నిర్మాణాలు నిలిపివేయాలని, వెంటనే కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ కిరణ్‌కుమార్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజేశ్, నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ సంఘటనా స్థలానికి చేరి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో మున్సిపల్ టీపీఓ వీరస్వామిని రప్పించి నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని చెప్పడంతో తక్షణమే నిర్మాణాలను కూల్చివేయాలని ఆర్డీఓ ఉమారాణి ఆదేశించారు. దీంతో టీపీఓ వీరస్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది నిర్మాణాలు తొలగించారు. దీంతో శాంతించిన దళిత సంఘాలు, స్థానిక కాలనీవాసులు వాటర్‌ట్యాంకు దిగి వచ్చారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు