
రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ
హన్మకొండ చౌరస్తా: భారత రాజ్యాంగాన్ని మోదీ సర్కారు అవహేళన చేస్తోందని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోందని పేర్కొన్నారు. హింసలేని స్వతంత్ర పోరాటంలో విజయం సాధించిన భారతదేశంలో నేడు మత విద్వేషాలకు బీజేపీ సర్కారు పునాది వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ ప్రజల హక్కులను హరించే కుట్రలో భాగమే అంబేడ్కర్‌ను అవమానించడం అన్నారు. ఈ సమావేశానికి వరంగల్, హనుమకొండ జిల్లాల ఇన్‌చార్జ్‌లుగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాయల నాగేశ్వర్‌రావు నియమితులైనట్లు వెల్లడించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వీడియోను ప్రదర్శించారు. సమావేశం చివరిలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అంటు ప్రతిజ్ఞ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, టీపీసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి