
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
వరంగల్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ తహసీల్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని, ఆన్‌లైన్‌లో సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యాలయ సమీపంలో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అధిక రుసుము వసూలు చేస్తున్నాడని కలెక్టర్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. నేరుగా కలెక్టర్ నిర్వాహకుడితో మాట్లాడి ఎక్కువ రుసుము వసూలు చేయొద్దని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోదాముల పరిశీలన..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ డాక్టర్ సత్యశారద అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో తహసీల్దార్ ఇక్బాల్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్యకు నివాళి
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద, అధికారులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రాజీవ్ యువ వికాసంపై అవగాహన
రాజీవ్ యువ వికాసం పథకంపై జిల్లాలోని అధికారులు, బ్యాంకర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యశారద గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.4,891 కోట్లకు డిసెంబర్ వరకు రూ.4,144 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రూ.414 కోట్ల నాన్ పర్ఫార్మెన్స్ రుణాలను రికవరీ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. 557 మంది విద్యార్థులకు రూ.41 కోట్ల విద్యారుణాలు, 22,026 యూనిట్లకు రూ.193 కోట్ల ముద్రరుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద