
నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధి వివిధ గ్రామాల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–163 (జి) భూసేకరణ ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్‌లో పరకాల ఆర్డీఓ నారాయణ, ఆయా తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో భూసేకరణ ప్రక్రియ, రైతుల భూములకు పరిహారం చెల్లింపు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అదనంగా కావాల్సిన 12.38 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ, గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భీమదేవరపల్లి, వేలేరు మండలాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అధికారులు కలెక్టర్‌కు వివరించారు. భూ సేకరణకు అవసరమైన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను తయారు చేయాలని చెప్పారు. ఎల్కతుర్తి జంక్షన్ నుంచి ముల్కనూరు వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల పురోగతి గురించి సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ అడిగారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.