
‘టైలరింగ్ హబ్’లు ఏర్పాటు చేయాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : ఇందిరా మహిళా శక్తి పథకం కింద గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ‘టైలరింగ్ హబ్’ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా విభాగానికి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా దుస్తులు కుట్టడానికి వీలుగా కటింగ్ చేసి ఇవ్వడంతో పాటు కాజా బట్టన్స్ కుట్టే మిషన్లను బల్దియా పరిధి వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున టైలరింగ్ హబ్‌లను(యూనిట్‌కు రూ.20 లక్షల వ్యయం) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‘ స్కీంలో భాగంగా ప్రభుత్వం వరంగల్ జిల్లాకు మిర్చి ప్రొడక్షన్ యూనిట్ కోసం రూ.కోటి మంజూరు చేసినందున మిర్చి పౌడర్ యూనిట్ స్థాపించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ యూనిట్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనందున ఎన్‌ఐటీ వద్ద యూనిట్ ఏర్పాటు చర్యలు వేగంగా చేపట్టాలని చెప్పారు. సారీ రోలింగ్, టైలరింగ్, టై అండ్ డై మగ్గం వర్క్‌లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి బల్దియా పరిధి కమ్యూనిటీ హాళ్లలో వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు 10 చొప్పున, వర్ధన్నపేట 6, పరకాలకు 3 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. ఈ శిక్షణను నగర ప్రాంతాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ అలివేలు, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీలత, సఫియా, రమ, సకినాల రమేశ్, నాగరాజు రాజ్‌కుమార్, అలీ, తదితరులు పాల్గొన్నారు.