
సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలని హనుమకొండ డీఆర్ ఓ, మెప్మా పీడీ వైవీ.గణేశ్ అన్నారు. బుధవా రం కలెక్టరేట్‌లో పట్టణ పరిధి హనుమకొండ, కాజీపేట, పరకాల, హసన్‌పర్తి మండలాల్లోని 141 పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం స్టిచ్చింగ్ చేసే మహిళా సమాఖ్య సభ్యులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయా స్కూళ్లలో చదువుతున్న 12 వేల మంది విద్యార్థులకు సంబంధించిన కొలతలు తీసుకొని సిద్ధంగా ఉండాలని, నిర్దేశించిన నమూనాలో నాణ్యంగా కుట్టి మే 31 వరకు ఇవ్వాలని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి కుట్టు కూలి జతకు రూ.75 కేటాయించామన్నారు. జిల్లా విద్యాశాఖ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, మెప్మా జిల్లా బాధ్యులు రజిత, ఎంఈఓలు మనోజ్, నెహ్రూ, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.