చెత్త తొలగింపునకు చర్యలు
కాళ్ల: ‘లక్షల్లో వ్యయం.. నెరవేరని లక్ష్యం’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కాళ్ల మండలంలోని బొండాడపేట గ్రామంలో పొలాలకు వెళ్లే రోడ్డు మార్జిన్‌లో చెత్త తొలగింపునకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఎవరూ చెత్త వేయకుండా బోర్డును ఏర్పాటుచేసినట్టు సచివాలయ సెక్రటరీ మణికంఠ తెలిపారు. మండలంలో డంపింగ్ యార్డ్‌లను ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
రెడ్‌జోన్‌లో మినహా చికెన్ తినొచ్చు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం కోళ్ల ఫారం నుంచి కిలోమీటర్ పరిధిలో, పెదతాడేపల్లిలోని రామలక్ష్మి కోళ్ల ఫారం నుంచి కిలోమీటర్ మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గుడ్లు, చికెన్ విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలు అపోహలు వీడి ఉడికించిన గుడ్లు, కోడి మాంసం ఆహారంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. చికెన్, గుడ్లు షాపులు, రెస్టారెంట్ యజమానులు వ్యాపారాలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
ప్రగతికి పరిశోధనలు కీలకం
తాడేపల్లిగూడెం: దేశ ప్రగతికి సైన్స్ పరిశోధనలు కీలకమని వరంగల్ నిట్ గణిత విభాగం ఆచార్యులు జేవీ రమణమూర్తి అన్నారు. శుక్ర వారం ఏపీ నిట్‌లో జరిగిన జాతీయ సైన్సు దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ మేధావి సీవీ రామన్ అని అన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకమైన ఆలోచనలతో ఆధునిక సాంకేతికతను జోడించి నూతన ఆవిష్కరణలను చేయాలన్నారు. డీన్‌లు హిమబిందు, జయరామ్, సందీప్, స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగాధిపతి ఎం.అమరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు శుక్ర వారం తెలిపారు. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులకు ఉదయం 8 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. కేజీఆర్‌ఎల్ జూనియర్ కళాశాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, సమస్యలుంటే సెల్‌లో 94917 22692 సంప్రదించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని వివరించారు.
రేపు ట్రెజరీ సంఘ ఎన్నికలు
భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్, అకౌంట్స్ సర్వీసెస్ జిల్లా సంఘ ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నట్టు ఉప ఖజానా అధికారి జె.రామారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరంలోని జిల్లా ఖజానా, లెక్కల కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికలు నిర్వహిస్తారని, ఎన్నికల అధికారులుగా రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ ఖాదర్, జి.నరేంద్ర కుమార్, ఎన్నికల పరిశీలకులుగా ఎ.ఆంజనేయులు వ్యవహరిస్తారని తెలిపారు.
సమస్యాత్మక కేంద్రాలపై
దృష్టి పెట్టాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదా వరి జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జె.రాజేంద్రప్రసాద్ కోరారు. స్థానిక విద్యానగర్‌లో శుక్రవారం మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో ఎటువంటి వివాదాలు రాకుండా నిర్వహించాలన్నారు. ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను యాజమాన్యాలు హల్‌టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు దృష్టి సారించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment