పోలింగ్ శాతంపై అనుమానాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి రెండు గంటల్లో అధిక శాతం పోలింగ్ నమోదుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి కొంత పెరిగింది. చివరి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు, వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరడం వంటివి లేకపోయినా.. పోలింగ్ మాత్రం 24.21 శాతం పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీడీఎఫ్ ఏజెంట్లు, నాయకులపై ప్రభుత్వ సహకారంతో టీడీపీ ఝులం ప్రదర్శించి ఏకపక్షంగా ఎన్నిక జరిపించిందని పీడీఎఫ్ ఆరోపణలు గుప్పించింది. అధికార యంత్రాంగం దాడులు, దౌర్జన్యాలపై కనీసం స్పందించలేదు.
2007 నుంచి పరిశీలిస్తే ఈ సారి అత్యధిక పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలో శాసన మండలిని పునరుద్ధరించారు. 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో 68 శాతం, 2013లో 53 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో 65.40 శాతం పోలింగ్ నమోదైంది. 2024లో మాత్రమే 69.50 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణంగా పట్టభద్రుల ఎన్నికల్లో సగటున 50 నుంచి 65 శాతం లోపు మాత్రమే పోలింగ్ నమోదవుతూ వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో ప్రజల్లో కూడా ఆసక్తి తక్కువగా ఉండటం, ఎన్నికల సంఘం విస్తృత స్థాయి ప్రచారం చేయకపోవడం ఇలా అనేక కారణాలు పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులే 60 శాతానికి మించి పోలింగ్ జరగదని చెబుతుంటారు. ఈ సారి చివరి రెండు గంటల్లో 24.21 శాతం పోలింగ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలింగ్ సమయంలో పీడీఎఫ్ ఏజెంట్లపై దాడులు చేసి చివరి రెండు గంటలు దొంగ ఓట్లు పోల్ చేశారని పీడీఎఫ్ ఆరోపించడంతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది.
ఏజెంట్లపై దాడులు, బూత్‌ల వద్ద నగదు పంపిణీ
ఉమ్మడి జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ సమీపంలో పది మంది టీడీపీ నాయకులు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా, ఓటు వేయడానికి వెళ్తున్న వారి వివరాలు నమోదు చేశారు. జిల్లాలో కనీసం 40 శాతం కూడా పీడీఎఫ్ నాయకులు ఈ తరహా క్యాంపులు నిర్వహించలేదు. అదే విధంగా పోలింగ్ బూత్‌ల్లోనూ పూర్తి స్థాయిలో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను కూడా టీడీపీ నేతలు వినియోగించుకున్నారు. పీడీఎఫ్ అభ్యర్థికి అన్ని చోట్ల ఏజెంట్లను ఏర్పాటు చేసినప్పటికీ అధికార పార్టీ హవాతో లింగపాలెం మండలం శింగగూడెం, పెదవేగి, జంగారెడ్డిగూడెంల్లో ఏజెంట్లపై దౌర్జన్యాలు చేసి బయటకు పంపడంపై అనుమానాలున్నాయి. లింగపాలెం మండలం యడవల్లిలో సీ.చిన్నారావు కుటుంబంతో కలిసి ఓటు వేయడానికి 278 పోలింగ్‌బూత్‌కు వస్తే అప్పటికే అతని ఓటు వేసేశారు.
గత ఎన్నికల్లో పోలింగ్ ఇలా
2007లో 68 శాతం పోలింగ్ నమోదై జార్జి విక్టర్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2013లో 1,04,946 ఓట్లు పోలవగా 53 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి ప్రాధాన్యత ఓటు 52,851 ఓట్లు దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థి కర్రి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. 2019లో 1,78,172 ఓట్లు పోలవగా 64.40 పోలింగ్ శాతం నమోదైంది. స్వతంత్ర అభ్యర్థి ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవీ) 98,193 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
చివరి రెండు గంటల్లోనే 24.21 శాతం నమోదు
ఉభయ గోదావరి జిల్లాల్లో 69.50 శాతం పోలింగ్
2007 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధికం
టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయించారని ఆరోపణలు
పీడీఎఫ్ ఏజెంట్లపై పలు చోట్ల దాడులు
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న పీడీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment