
రైల్వే పార్శిళ్లలో దళారుల రాజ్యం
తణుకు అర్బన్: తణుకు రైల్వే స్టేషన్ పార్శిళ్ల రవాణాలో దళారుల దోపిడీ రాజ్యం నడుస్తోంది. పార్శిళ్లకు దళారులు చార్జీల మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా రైళ్లలో ద్విచక్ర వాహనాల రవాణా చేసేందుకు భారీగా దోచుకుంటున్నారు. తణుకు రైల్వే స్టేషన్ నుంచి నిత్యం హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం తదితర దూరప్రాంతాలకు ద్విచక్ర వాహనాలు పార్శిళ్ల రూపంలో రైళ్లలో వెళ్తుంటాయి. ఇందుకోసం ముందుగా రైల్వే కౌంటర్‌లో దరఖాస్తు రాసి రుసుం చెల్లించాలి. ఇంతవరకూ బాగానే ఉన్నా పార్శిల్ విభాగంలో ఉన్న దళారులు వాహనం ప్యాకింగ్, ఇతర ఖర్చులంటూ డబ్బులు గుంజేస్తున్నారు.
ఇటీవల బెంగళూరుకు వాహనం పంపించేందుకు పట్టణానికి చెందిన వ్యక్తి రైల్వే కౌంటర్‌లో రూ.1850 కట్టాడు. పార్శిల్ చేసే క్రమంలో దళారులకు మరో రూ.వెయ్యి కట్టాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు వాహనం పంపించేందుకు మరో వ్యక్తి రైల్వే కౌంటర్‌లో రూ.935 చెల్లించి, పార్శిళ్ల విభాగంలో రూ.600 కట్టాడు. రైల్వే ట్రాన్స్‌పోర్టు తక్కువవుతుందని వస్తున్నామని, ఇక్కడ కూడా ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులో తీసుకున్నట్లే దోచుకుంటున్నారని వాహనదారులు వాపోతున్నారు. తత్కాల్ టికెట్ల వ్యవహారంలో కూడా దళారులు కీలకపాత్ర పోషిస్తున్నారని, అధికారులకు కూడా వాటాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగులకు వాటా ఇస్తున్నాం : తాము తీసుకునే మొత్తంలో రైల్వే గార్డు నుంచి పైస్థాయి అధికారుల వరకు ఇవ్వాలని దళారులు చెబుతున్నారు. ప్రతి వాహనంలో వసూలు చేసే మొత్తంలో రైల్వే వర్గాలకు ఇచ్చిన తరువాత మిగిలింది తాము తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయంపై తణుకు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నాగరాజును సాక్షి వివరణ కోరగా వాహనాల పార్శిళ్లకు సంబంధించి రుసుం వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని విచారణ చేయిస్తానని చెప్పారు.
వాహనానికి రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా వసూలు
అధికారులకూ వాటా ఇస్తున్నామంటున్న దళారులు
రూ.1000 వసూలు చేశారు
బెంగళూరులో ఉంటున్న మా అబ్బాయికి గత నెల 12న ద్విచక్ర వాహనాన్ని తణుకు రైల్వే స్టేషన్ ద్వారా పంపించాను. రైల్వే బుకింగ్‌లో రూ.1850 కట్టించుకోగా పార్శిల్ విభాగంలో రూ.వెయ్యి కట్టించుకున్నారు. రైల్వే టికెట్‌కు కూడా అదనంగా రైల్వే కౌంటర్‌లోనే డబ్బులు కట్టాను. అడుగుదామంటే కొత్త బండి ఏ రకంగా పంపిస్తారో, ఏమైనా డ్యామేజ్ చేస్తారేమోనని వారు అడిగిన మొత్తం ఇచ్చేశాను. ప్రభుత్వ విభాగాల్లో కూడా దళారుల రూపంలో డబ్బులు దోచేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో తెలియడంలేదు.
–కె.రాము, తణుకు

రైల్వే పార్శిళ్లలో దళారుల రాజ్యం
Comments
Please login to add a commentAdd a comment