
అడవిలో ఆధ్యాత్మిక శోభ
బుట్టాయగూడెం: అడవి తల్లి ఒడిలో కొలువుదీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం జాతరకు సిద్ధమవుతుంది. ఈ నెల 14 నుంచి 16వ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దుతున్నారు. పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు, గలగల పారే సెలయేర్ల మధ్య ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో కొలువై ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై భక్తుల పూజలందుకుంటోంది. గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి దూరప్రాంతాల నుంచి అత్యధికంగా భక్తులు తరలి వస్తుంటారు.
గిరిపుత్రులే ఆలయ పూజారులు
ఆదివాసీ ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మ తల్లికి గిరిజన పూజారులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మ వారికి గిరిపుత్రులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులు విక్రయిస్తుంటారు.
ప్రయాణం ఆహ్లాద భరితం
మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లే మార్గలో ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తర్వాత కొంత దూరం వెళ్లే సరికి దట్టమైన అడవి ఉంది. అక్కడ నుంచి కొద్ది దూరం తర్వాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి.
దర్శనానికి మార్గం ఇలా
గుబ్బల మంగమ్మ తల్లి గుడికి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్లొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, పట్టినపాలెం మీదుగా రామారావుపేట సెంటర్, అంతర్వేదిగూడెం, పందిరిమామిడి మీదుగా కూడా వెళ్లొచ్చు. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అశ్వారావుపేట నుంచి రాచ్చన్నగూడెం, పూచికపాడు మీదుగా దర్శనానికి రావచ్చు. అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా అటవీ మార్గంలో మంగమ్మ తల్లిని దర్శించుకోవచ్చు.
గుబ్బల మంగమ్మ జాతరకు ఏర్పాట్లు
ఈ నెల 14 నుంచి 16 వరకు జాతర
ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
ఈ నెల 14 నుంచి 16 వరకు జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం. హోలి పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. పాలాభిషేకాలు, గణపతి విశేష సర్వయంత్ర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కోర్సా గంగరాజు, సర్పంచ్, కోర్సవారిగూడెం
గిరిజన సంప్రదాయంలోనే పూజలు
గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. చీర, సారె కావిళ్లు అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు చెల్లిస్తాం. కార్యక్రమానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. గుజ్జా రామారావు,
ఆలయ కమిటీ ప్రతినిధి, కామవరం

అడవిలో ఆధ్యాత్మిక శోభ

అడవిలో ఆధ్యాత్మిక శోభ

అడవిలో ఆధ్యాత్మిక శోభ

అడవిలో ఆధ్యాత్మిక శోభ
Comments
Please login to add a commentAdd a comment