పేదింట నిత్యావసరాల మంట | - | Sakshi
Sakshi News home page

పేదింట నిత్యావసరాల మంట

Published Wed, Mar 5 2025 2:04 AM | Last Updated on Wed, Mar 5 2025 2:04 AM

పేదిం

పేదింట నిత్యావసరాల మంట

సాక్షి, భీమవరం: పేదల్లో ఇళ్లల్లో నిత్యావసరాల మంట రాజుకుంటుంది. నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో పేదల ఇంట పప్పులు ఉడకనంటుంటే.. నూనెలు సలసలమంటున్నాయి. రేషన్‌ ద్వారా కందిపప్పు సరఫరాకు సర్కారు ఎగనామం పెట్టగా, ధరల నియంత్రణ కోసమంటూ గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. మార్కెట్‌లో పప్పుల ధరలు మండిపోతున్నాయి. కిలో కందిపప్పు రూ. 150 ఉంటే పెసరపప్పు రూ. 130, మినపప్పు రూ. 110 ఉంది. మరోవైపు పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.140లు ఉండగా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.150 ఉంది. జనవరిలో రూ.120 ఉన్న పామాయిల్‌ ఫిబ్రవరిలో రూ. 20 పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. అదేమాదిరి ఇతర నూనెల ధరలు పెరిగాయి. నిత్యావసరాలు లేనిదే రోజు గడవని పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలు పేదలకు భారమవుతున్నాయి. ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వం చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పత్తాలేని ప్రత్యేక కౌంటర్లు

నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఆధ్వర్యంలో నవంబరులో జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు, ప్రైవేట్‌ దుకాణాల్లో 22 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. హోల్‌సేల్‌ ధరలపై ఉల్లిపాయలు, పామాయిల్‌, టమాట, బియ్యం తదితర సరుకుల అమ్మకాలు చేపట్టారు. పామాయిల్‌ రూ. 110కు, ఇతర సరుకులను బయటి మార్కెట్‌లో కంటే కొంతమేర తగ్గింపు ధరలకు విక్రయాలు చేశారు. అయితే నిర్వహణ సరిగా లేక కొద్దిరోజులకే చాలా చోట్ల ఇవి మూతపడిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఇవి వినియోగంలో ఉన్న దాఖలాలు లేవు.

కందిపప్పు రాలేదు

జిల్లాలో 5.68 లక్షల రేషన్‌కార్డులు ఉండగా 356 ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం, పంచదార సరఫరా చేసేవారు. అక్టోబరు నుంచి కందిపప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఐదు నెలలు తిరగకుండానే చేతులెత్తేసింది. జిల్లాలో 1,052 మంది రేషన్‌ డీలర్లు ఉండగా ప్రతినెలా 20వ తేదీలోపు సరుకుల కోసం అవసరమైన మొత్తానికి డీడీలు తీయాల్సి ఉంది. ఈ మేరకు నాలుగు నెలలు పాటు కార్డుదారులకు కిలో రూ. 67కు కందిపప్పు సరఫరా చేసింది. ఫిబ్రవరి నెలకు కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా 568 టన్నులకు గాను కేవలం 110 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. డీడీల్లోని మిగిలిన సొమ్ములను ఇతర సరుకులకు సర్దుబాటు చేశారు. అయితే మార్చి నుంచి ప్రభుత్వం పూర్తిగా కందిపప్పు సరఫరాను నిలిపివేసింది. ఈ నెలలో కందికప్పు కోసం డీడీలు తీయవద్దని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ముందుగానే డీలర్లకు సమాచారం ఇచ్చారు. గత నెలలో పూర్తిస్థాయిలో కందిపప్పు రాకపోవడంతో వచ్చిన సరుకును సరిగా పంపిణీ చేయకుండా కొందరు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే స్టాకు రాలేదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో కందిపప్పును బయటిమార్కెట్‌లో అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా ఈ నెలకు సంబంధించి కందిపప్పు రాలేదని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు సరఫరాపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఆకాశాన్ని అంటుతున్న పప్పుల ధరలు

సలసలమంటున్న నూనెలు

కందిపప్పు పంపిణీకి సర్కారు ఎగనామం

కందిపప్పు కొనలేకున్నాం

రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు సరఫరా చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో కొన్న కందిపప్పు నాణ్యంగా ఉండడం లేదు. రేషన్‌ షాపు ద్వారా కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి.

– ఎ.సత్యవతీదేవి, ఆకివీడు

నిత్యావసరాల ధరలు పెరిగాయి

గత కొద్ది రోజులుగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు సరుకులు కొనుక్కోవాలంటే భారంగా ఉంటుంది. కందిపప్పు, మినప్పప్పు అలాగే ఆయిల్‌ రేట్లు పెరిగాయి. నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బి చంద్రకుమారి, జున్నూరు పెద్దపేట

No comments yet. Be the first to comment!
Add a comment
పేదింట నిత్యావసరాల మంట 1
1/4

పేదింట నిత్యావసరాల మంట

పేదింట నిత్యావసరాల మంట 2
2/4

పేదింట నిత్యావసరాల మంట

పేదింట నిత్యావసరాల మంట 3
3/4

పేదింట నిత్యావసరాల మంట

పేదింట నిత్యావసరాల మంట 4
4/4

పేదింట నిత్యావసరాల మంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement