ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఒక భక్తురాలు మంగళవారం తన మెడలోని 5 కాసుల బంగారు హారాన్ని పోగొట్టుకుంది. బాధితురాలి కథనం ప్రకారం. పెదవేగి మండలం అంకన్నగూడెంకు చెందిన కోసూరి దుర్గా ప్రభావతి కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం శ్రీహరి కళాతోరణం వేదిక పక్కనున్న ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి, తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో వాహనాల పార్కింగ్ ప్రాంతంలోకి వెళ్లారు. ఆ సమయంలో మెడలో బంగారు హారం లేకపోవడాన్ని ఆమె గమనించారు. కంగారు ఆమె తిరిగిన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం దక్కలేదు. దాంతో దేవస్థానం అధికారులకు సమాచారం అందించగా, సిబ్బంది సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న మంచినీటి కుళాయి వద్ద, కింద పడి ఉన్న బంగారు హారాన్ని ఒక మహిళ తీసుకుని వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది. వెంటనే బాధితురాలు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
లోక్‌అదాలత్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ బిల్లుల కేసులను పరిష్కరించుకోవాలి
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని బీఎస్‌ఎన్‌ఎల్ బిల్లుల బకాయిల కేసులను పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు జిల్లా, మండల న్యాయ సేవాధికార కమిటీలతో ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, భీమవరం, నరసాపురం పరిధిలోని లోక్ అదాలత్ కోర్టుల్లో ఈ నెల 8వ ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులు తమ బకాయిలను ముందుగానే చెల్లించాలనుకుంటే వారు తమ దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94947 08898, 9490312777, 94404 33533 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
తప్పిపోయిన పిల్లల అప్పగింత
గణపవరం: తప్పిపోయిన ఇద్దరు బాలుర విషయమై గణపవరం పోలీసులు అత్యవసరంగా స్పందించడంతో వారిని గంటల వ్యవధిలోనే పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన 13 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు ఈ నెల 3వ తేదీ రాత్రినుంచి కనిపించకుండా పోయారు. వారికోసం కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లు గాలించినా ఫలితం లేకపోవడంతో ఆ పిల్లల అమ్మమ్మ పూడి కాంతమ్మ అర్ధరాత్రి 3 గంటలకు 112 నెంబరు ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గణపవరం సీఐ ఎంవి సుభాష్, ఎస్సై మణికుమార్‌లు స్పందించి హెడ్‌కానిస్టేబుల్ రత్నప్రసాద్, పీసీ పి.కాంతయ్య, హెచ్‌సీ ఎం.సతీష్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించడంతో పిప్పర పరిసర ప్రాంతాలలో పిల్లలను గుర్తించి మంగళవారం ఉదయం పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment