
ఆర్థిక ఇబ్బందులతో ఆక్వా రైతు ఆత్మహత్య
నిడమర్రు: ఆర్థిక ఇబ్బందులతో ఆక్వారైతు నిమ్మల శ్రీను (42) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెదనిండ్రకొలను గ్రామంలో సంచలనం కలిగించింది. వివరాల ప్రకారం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన నిమ్మల శ్రీను గుణపర్రు గ్రామంలో ఆక్వా చెరువులు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆక్వా చెరువుల్లో గ్యాస్ (అల్యుమినియం ఫాస్సైండ్ 56 శాతం ) ట్యాబ్‌లెట్స్‌ను శ్రీను మింగేశాడు. అనంతరం సోదరుడు రామకృష్ణకు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మృతుడు ఫోన్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతుని కోసం ఆరా తీయగా లీజుకు తీసుకున్న గుణపర్రు చెరువుల వద్ద ఉన్నట్లు తెలియడంతో అక్కడకు వెళ్లి గణపవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లగా ఆక్కడ డాక్టర్ల సూచనల మేరకు తాడేపల్లిగుడెం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల ఆశించిన స్థాయిలో ఆక్వా సాగు లేకపోవడం, ఇల్లు కట్టడంతో ఉన్న ఎకరం పొలం అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో మానసికంగా ఆందోళనే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెపుతున్నారు. మృతుడు సోదరుడు నిమ్మల రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. మృతుడు శ్రీనుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment