
వైభవంగా పెద్దింట్లమ్మ జాతర
కై కలూరు: పంచహారతుల మధ్య కొల్లేటికోట పెద్దింట్లమ్మతల్లి దేదీప్యమానంగా భక్తులకు దర్శినమిచ్చారు. పెద్దింట్లమ్మ జాతర మంగళవారానికి నాలుగో రోజుకు చేరింది. అమ్మవారికి పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం వంటి వైదిక కార్యక్రమాలు చేశారు. వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదదాతులుగా ఆటపాకకు చెందిన వేగేశ్న ప్రసాదరాజు, గణపవరానికి చెందిన రుద్రరాజు పుల్లంరాజు అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పెరికేగూడెంకు చెందిన శ్యామలాంబ కళానికేతన్ ఆధ్వర్యంలో త్రిరత్నాలు సాంఘిక ప్రదర్శన అహుతులను అలరించింది. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 13 వరకు జాతర జరుగుతుందని, జలదుర్గాగేకర్ణేశ్వరస్వామి దివ్వ కల్యాణం ఈ నెల 10న నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. రెండు వాహనాల్లోనూ 52 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా జరిపిన దాడిలో మండలంలోని దేవులపల్లి నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి ఒక వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో పిఠాపురం మండలం బి.పత్తిపాడుకు చెందిన కామిరెడ్డి వీరవెంకట్రావును అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నుంచి మరొక వాహనంలో యర్రంపేట కు రవాణా అవుతున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో యర్రంపేటకు చెందిన నల్లమోతు సూర్యప్రకాష్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై జబీర్‌తోపాటు సివిల్ సప్లయిస్ డీటీ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment