భీమవరం (ప్రకాశంచౌక్): ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగ రాణి మాట్లాడుతూ రుణాలు మార్చి 31లోపు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.25 కోట్లు మంజూరు కాగా, వీటిని మూడు నుంచి ఐదు మంది సభ్యులు కలిగిన గ్రూపులకు మంజూరు చేస్తామన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని, దీనిలో 40 శాతం సబ్సిడీ, 40 శాతం టర్మ్ లోన్, 20 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణాల మంజూరుకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరు నిధులలో సుమారు 40 నుంచి 60 శాతం నిధులను సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు కేటాయించి, లబ్ధిదారులను గుర్తించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయప్రకాష్, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment