ఈ హామీల మాటేంటి? | - | Sakshi
Sakshi News home page

ఈ హామీల మాటేంటి?

Published Thu, Mar 6 2025 2:42 AM | Last Updated on Thu, Mar 6 2025 2:42 AM

ఈ హామ

ఈ హామీల మాటేంటి?

ఆరోగ్య ఆసరాకు ఎసరు

ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకు భరోసాగా నిలిచే ఆరోగ్య ఆసరా పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. సాధారణ డెలివరీ, సిజేరియిన్‌లకు రూ.5 వేల చొప్పున, రోడ్డు ప్రమాద బాధితుల్లోని ఎముకలకు సర్జరీ కేసులకు రూ.10 వేలు, కాళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సంబంధించి సెల్యులైటీస్‌ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575, కొన్ని చెవి, గొంతు, ముక్కు సర్జరీలకు రూ.1,275, గుండె శస్త్రచికిత్సలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు.. ఇలా చికిత్సలను బట్టి రోజుకు రూ.275లు చొప్పున సాయం లెక్కకట్టి అందించేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపు నిలిపివేయడంతో ఆరోగశ్రీ లబ్ధిదారులకు భరోసా కరువైంది.

సాక్షి, భీమవరం: ‘ఒడ్డు చేరేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉంది కూటమి తీరు. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో కూటమి నేతలు లెక్కలేనన్ని హామీలిచ్చారు. ప్రభుత్వం రావడమే తరువాయి అన్నింటినీ ఆచరణలో పెట్టేస్తామంటూ ఓటర్లను నమ్మించారు. ఈ తొమ్మిది నెలల్లో చేసిందేమీ లేకపోగా పేదలు గంపెడాసతో ఎదురుచూసిన 2025–26 వార్షిక బడ్జెట్‌లోనూ హామీల అమలుకు కేటాయింపులు చేయ కుండా మసిపూసి మారేడుకాయ చేశారు.

50 ఏళ్లకే పింఛన్‌పై వంచన : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఎడాపెడా ఊదరగొట్టేశారు. ఇప్పుడు వాటి ఊసెత్తకపోగా విచారణ పేరిట ఉన్న వాటికీ కొర్రీ పెట్టే పనిలో పడ్డారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 2.50 లక్షల మంది వరకు ఉండగా వారిలో అర్హులైన వారు 70 శాతం మంది ఉంటారని అంచనా. వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్నవాటికీ అరకొర కేటాయింపులు అనుమానాలకు తావిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గతేడాది జూన్‌లో జిల్లాలో పింఛన్‌ లబ్ధిదారులు 2,34,161 మంది ఉన్నారు. కొత్త మంజూరులు చేయకపోగా వివిధ కారణాలతో 7,075 మంది పింఛన్లను తొల గించారు. దీంతో ఈ సంఖ్య 2,27,086కు తగ్గింది.

‘వల’విల.. మత్స్యకారులు వెలవెల

వేట విరామం సందర్భంగా మత్స్యకార భృతిని రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు పెంచుతా మని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతేడాది మత్స్యకారభృతి అందించకపోగా బడ్జెట్‌లోనూ దీనిపై స్పష్టత లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న మత్య్సకార భృతిని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 వేలలకు పెంచారు. ఐదేళ్ల పాటు ఏటా మే నెలలో ఈ సాయం అందిస్తూ వచ్చారు. గత టీడీపీ హయాంలో జిల్లాలో కేవలం 76 మంది మాత్రమే అర్హులు ఉండగా జగన్‌ హయాంలో 1,162 మందికి మేలు చేశారు.

చేనేతపై చిన్నచూపు : కూటమి బడ్జెట్‌లో చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ హామీలు ఇచ్చినా బడ్జెట్‌లో వాటి ఊసెత్తలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సొంత మగ్గం ఉన్న నేత కార్మికుల కుటుంబాలకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందించారు. ఐదేళ్లలో జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్ల లబ్ధి చేకూర్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక నేతన్న నేస్తాన్ని నిలిపివేసింది. నేతన్నల కోసం ప్రత్యేక కార్యాచరణ లేకపోవడంతో చేనేత రంగం కుదేలవుతోంది.

పింఛన్‌ హామీ ఏమైంది?

ఎస్సీ, బీసీలకు 50 ఏళ్లకే ఇస్తామన్న పింఛన్‌ హామీ ఏమైంది. ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. యాభై ఏళ్లకే బీసీలకు ఫించన్‌ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసింది. ఇది నమ్మక ద్రోహం.

– పోతురాజు డేవిడ్‌

సొమ్ములు ఎగ్గొట్టారు

గత ప్రభుత్వం అందించిన మత్స్యకార భరోసా వేట నిషేధ సమయంలో మాకు ఎంతగానో ఉపయోగపడింది. కూటమి సర్కారు ఈ మొత్తాన్ని మరింత పెంచి ఇస్తామని చెప్పడంతో నమ్మి ఓట్లేశాం. గతేడాది సొమ్ములు ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా వేస్తారనే నమ్మకం లేదు. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం.

– మైల వీరాస్వామి, చినమైనవానిలంక

వంచించి.. విస్మరించి..

50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌

మత్య్సకార భరోసా రూ.20 వేలకు పెంపు

ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50లకే విద్యుత్‌

ఎన్నికల్లో హామీలను గుప్పించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

బడ్జెట్‌ కేటాయింపుల్లో వాటి ప్రస్తావనే లేని వైనం

ఆక్వాకు దగా

జిల్లాలో ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఆక్వా రైతులు అందరికీ విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50కే ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఏరియేటర్స్‌ మీద సబ్సిడీ ఇప్పిస్తామని, అవసరమైన చోట్ల 500 టన్నుల సామర్థ్యం గల కోల్ట్‌ స్టోరేజీలు నిర్మిస్తామన్నారు. అయితే బడ్జెట్‌పై ఆయా హామీల అమలుపై స్పష్టత లేదు. జిల్లాలో 1.24 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. 16,019 ఆక్వా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా వీటిలో పది ఎకరాలకు పైబడిన కనెక్షన్లు 1,142, నాన్‌ఆక్వా జోన్‌ పరిధిలో 953 ఉన్నాయి. గతంలోనూ రూ.2లకే సబ్సిడీ విద్యుత్‌ను ఇస్తామని టీడీపీ దగా చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పదెకరాలలోపు రైతులందరనీ ఆక్వాజోన్‌ పరిధిలోకి తీసుకువచ్చి రూ.1.50లకే సబ్సిడీ విద్యుత్‌ను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఈ హామీల మాటేంటి?1
1/2

ఈ హామీల మాటేంటి?

ఈ హామీల మాటేంటి?2
2/2

ఈ హామీల మాటేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement