
మద్యం మత్తులో హత్య
అత్తిలి: పాత గొడవను పురస్కరించుకుని ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్య గురైన ఘటన అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు దంతుపల్లి గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు (35) కొబ్బరికాయలు దింపుపనికి వెళుతుంటాడు. అదే గ్రామానికి చెందిన కడలి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట నారాయణ, జుత్తిగ వీరాంజనేయులు స్నేహితులు. వీరిద్దరూ కలిసి తరచూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఆరు నెలల క్రితం వెంకటేశ్వరరావు కుడి చెవివద్ద వీరాంజనేయులు కత్తితో గాయం చేశాడు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు దీనిపై కక్ష్య పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి మహాంకాళమ్మ ఆలయం వద్ద బల్లపై కూర్చుని మద్యం సేవిస్తుండగా పాతగొడవను పురస్కరించుకుని ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో కడలి వెంకటేశ్వరరావు రాయితో వీరాంజనేయులు తల, ముఖంపై కొట్టి పక్కనే ఉన్న పంట కాలువలో పడవేసి ఇంటికి వచ్చేశాడు. రాత్రి సమయానికి కూడా వీరాంజనేయులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావును నిలదీయగా తానే రాయితో కొట్టి హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు హత్యకు గురైన ప్రాంతానికి చేరుకుని కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రదేశానికి అత్తిలి ఎస్సై పి ప్రేమరాజు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఒక కుమార్తె ఉన్నారు. భార్యభర్తల గొడవలు కారణంగా భార్య రెండేళ్లక్రితం భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. మృతుని సోదరి మట్టపర్తి మంగాయమ్మ ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి ప్రేమరాజు తెలిపారు.

మద్యం మత్తులో హత్య
Comments
Please login to add a commentAdd a comment