
తణుకులో చికెన్ మేళా
తణుకు అర్బన్ : తక్కువ ధరతో ఎక్కువ ప్రొటీన్ అందించే చికెన్, కోడిగుడ్లు తీసుకోవడంలో అపోహలు అవసరం లేదని కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. తణుకు నెక్ కల్యాణ మండపంలో బుధవారం పౌల్ట్రీ ఫెడరేషన్, జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. బర్డ్‌ఫ్లూ సంక్షోభం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నేడు ఆ పరిస్థితులు తొలగిపోయాయని ప్రజలు నిరభ్యంతరంగా చికెన్, కోడిగుడ్లు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. చికెన్ తినడం వలన ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పారు. బాగా ఉడికించి చికెన్ తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కోళ్ల రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలనే అభ్యర్థనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. చికెన్, ఎగ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నెక్ చైర్మన్ మల్లిన శ్రీనివాసరావు, ఆర్డీవో కౌసర్ బానో, పశుసంవర్ధకశాఖ అధికారి కె.మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment