చంద్రబాబువి చవకబారు రాజకీయాలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు
జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ సీపీ నేతలు, మద్దతుదారులకు ఎటువంటి పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చవకబారు రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీకి సుమారు 1.33 కోట్ల మంది మద్దతిచ్చారని, వారందరికీ సంక్షేమాన్ని ఆపేస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ వ్యవస్థ ద్వారా కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా సమానంగా సంక్షేమాన్ని అందించి ప్రజలందరి మెప్ప పొందారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రం 30 నుంచి 40 ఏళ్లు వెనక్కి పోయేలా ఉందన్నారు. ఫ్యాక్షన్ రాజకీయం తీసుకువచ్చి కులాలు, పార్టీల మధ్య చిచ్చుపెట్టవద్దని హితవు పలికారు. సూపర్ సిక్స్‌ను అమలు చేసి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చెప్పిన మాటలను నిజం చేసి, వారి మనోభావాలు కాపాడాలని సూచించారు. తాము సూపర్‌సిక్స్ గురించి మాత్రమే మాట్లాడతామని, అంతకు మించి తమకేమీ అక్కర్లేదని జెట్టి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment