ఆకివీడు: లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి చెందిన ఘటన ఆకివీడులో చోటుచేసుకుంది. కై కలూరు నియోజకవర్గంలోని పెదకొట్టాడ గ్రామానికి చెందిన మద్దా మరియదాసు (38) ఆకివీడులో ఫిష్‌ప్యాకింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఫిష్‌ప్యాంకింగ్ పనులు ముగించుకుని మోటారు సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో కై కలూరు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియదాసు తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. దాసుకు భార్య, ముగ్గురు మగపిల్లలు ఉన్నారని, అతడి భార్య విదేశాల్లో ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దాసు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు.
ఏటీఎంలో చోరీకి యత్నం
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని కరూర్ వైశ్యాబ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కరూర్ వైశ్యాబ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు యత్నించారు. ముందుగా ఏటీఎం గదిలోకి ప్రవేశించేందుకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి పరిశీలించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు
అత్తిలి: దంతుపల్లిలో జరిగిన హత్యకేసులో నిందితుడు కడలి వెంకట నారాయణను తణుకు రూరల్ సీఐ బి కృష్ణకుమార్ అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారని ఎస్సై పి ప్రేమరాజు గురువారం తెలిపారు. దంతుపల్లి గ్రామంలో జుత్తిగ వీరాంజనేయులను రాయితో కొట్టి హత్యచేసిన వెంకట నారాయణను ఇంటివద్ద అరెస్ట్ చేసి తణుకు కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్సై చెప్పారు.
ఇంట్లోకి ప్రవేశించి.. కంట్లో కారం కొట్టి
జంగారెడ్డిగూడెం: ఇంట్లోకి ప్రవేశించి, కంట్లో కారం కొట్టి, మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన భూమా భాస్కరరావు, రత్నావతి స్థానిక బెనర్జీగారి వీధిలోని దుర్గాభవానీ అపార్టుమెంటులో నివాసముంటున్నారు. గురువారం ఉదయం భాస్కరరావు పనిమీద బయటకు వెళ్లగా రత్నావతి ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఇంట్లో ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ అపరిచిత వ్యక్తి ఆమె మెడలో ని బంగారు గొలుసు, సూత్రాలను లాక్కుని పరారయ్యాడు. ముఖానికి మాస్కు పెట్టుకుని వచ్చిన దుండగుడు తన జుట్టు పట్టుకుని, తన కళ్లల్లో కారం కొట్టి కట్టర్ సహాయంతో సూత్రాలతో పాటు గొలుసును కత్తిరించుకుపోయాడని బాధితురాలు రత్నావతి కన్నీటిపర్యంతమైంది. విషయం తెలుసుకున్న ఎస్సై జబీర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment