
నిట్ డైరెక్టర్‌కు ఉగాది పురస్కారం
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు కిన్నెర ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ విషయాన్ని నిట్ అధికారులు శనివారం తెలిపారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు న్యాయ, పోలీసు, రక్షణ, ఇంజనీరింగ్, సాహిత్యం ,వైద్యం, నాటకం, నృత్యం, సంగీతం, ప్రసార మాద్యమం, చిత్రలేఖనం, హస్తకళలు వంటి పలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఏటా గుర్తించి అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాదికి సివిల్ ఇంజనీరింగ్ రంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్యులు రమణారావును ఎంపిక చేశారు. ఇటీవల హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణా గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.