
నిర్వాసితుల ఇళ్ల గల్లంతుపై మళ్లీ విచారణ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టులో ఇళ్లను కోల్పోతున్న అర్హులైన నిర్వాసితుల పేర్లను తొలగించిన స్పెషల్ కలెక్టర్ సరళావందనం మళ్లీ ఈ పేర్లపై విచారించాలని తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏలూరు–2 కు లిఖితపూర్వకంగా ఆదేశించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన అవార్డు ఉత్తర్వులో వేలేరుపాడు మండలం జగన్నాధపురంలోని 140 మంది నిర్వాసితుల పేర్లను స్పెషల్ కలెక్టర్ సరళ వందనం తొలగించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళ వందనం గత ఏడాది అక్టోబర్ నెలలో అప్పటి ఏలూరు ఎస్‌డీసీ ముక్కంటితో విచారణ చేయించారు. అప్పట్లో వేలేరుపాడు తహసీల్దార్, వీఆర్వో, గ్రామ పంచాయితీ కార్యదర్శి, ఎంపీడీఓల సమక్షంలో విచారణ చేపట్టారు. 2015, 2016, 2017 ఇంటి పన్ను రశీదులు పరిశీలించి ఎస్‌డీసీ కార్యాలయానికి అందరి అధికారుల సంతకాలతో పంపారు. మళ్లీ తొలగించిన నిర్వాసితుల ఇండ్లను విచారించాలని, అన్ని ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిజంగా ఇండ్లు ఉన్నాయా... లేదా? అన్న అంశాలను పరిశీలించాలని పోలవరం స్పెషల్ కలెక్టర్ తాజాగా ఆదేశించారు. దీంతో మంగళవారం ఏలూరు ఎస్‌డీసీ వాకా శ్రీనివాసరెడ్డి విచారణ చేపట్టారు. ఇంటింటింకీ తిరిగి నోట్ కెమెరాతో ఫొటోలు తీశారు. ఇంటి యజమాని అందుబాటులో ఉంటే ఇంటి ముందు నిలబెట్టి ఫొటోలు తీశారు. వీరితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏ, వీఆర్వో, ఎస్‌డీసీ కార్యాలయ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు.
గతంలో పేర్లు తొలగించిన స్పెషల్ కలెక్టర్ సరళావందనం
మళ్లీ విచారించాలని తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు ఆదేశం
ఇంటింటికీ తిరిగి నోట్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న అధికారులు