
కూలి డబ్బుల కోసం ఎదురుచూపులు
● మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు బంద్
● రూ.13.12 కోట్ల బకాయిలు
భీమవరం(ప్రకాశం చౌక్): బతుకుదెరువు కోసం ఎండలో కష్టపడి పనిచేసే ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత మూడు నెలలగా ఉపాధి కూలీలకు వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు బకాయి పెట్టారు. కూలీ డబ్బులు కోసం నిరు పేదలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేతనాలు రాకపోయేసరికి అప్పులు చేసుకునే బతుకుతున్నారు. వేతనాలు ఎప్పుడు పడతాయే అధికారులకు కూడా తెలియని పరిస్థితి.
ఒక్కో కూలీకి రూ.4 వేల వరకూ బకాయి
జిల్లాలో 20 మండలాల్లో ఫ్రిబవరి నుంచి ఇంతవరకు ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయి రూ.13.12 కోట్లకు పైగానే ఉంది. ఒక్కో ఉపాధి కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లించాల్సి ఉంది. మూడు నెలల దాటినా వారి ఖాతాలో వేతనాలు జమకావడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.కోట్ల నిధులు ఉన్నప్పటికీ వేతనాలు ఇవ్వడం లేదు. కూలీలకు వేతనాలు చెల్లించకుండా బకాయిలు మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఆ నిధులు దేనికి మళ్లిస్తున్నారు.. ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ నిధులు ప్రభుత్వం ఏం చేస్తుందో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలంటున్నారు. జాతీయ ఉపాధి హమీ పథకం ప్రారంభించిన నాటి నుంచి గత ప్రభుత్వ పాలన వరకూ ఎప్పుడూ కూలీలకు ఇలా బకాయిలు పెట్టింది లేదు.
ముమ్మరంగా పనులు
జిల్లాలోని 20 మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. పంట కాలువలు, చెరువులు పూడికతీత పనులు చేయిస్తున్నారు. రోజుకు జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
ఉపాధి జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు : 1,84,459
యాక్టివ్‌గా ఉన్న జాబ్ కార్డులు : 1,2,806
మొత్తం కూలీలు : 3.3 లక్షలు
పనికి వెళుతున్న కూలీలు : 1.48 లక్షలు
రోజుకు కూలీ వేతనం రూ.300