
చేపల సాగులో కోడి వ్యర్థాలు
కై కలూరు: కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, చనిపోయిన కోడి పిల్లలు, పాడైన కోడిగుడ్లు ఇవి కొల్లేరు ప్రాంతమైన చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు వేస్తున్న ఆహారం. వీటిని తిన్న చేపలను మనం తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం. అయినా కొందరు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు, 1.10 ఎకరాల్లో రొయ్యల సాగు వెరసి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 30,972 మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో ఫంగసీస్ సాగు సుమారు 8 వేల ఎకరాల్లో జరుగుతుందని అంచనా. ఫంగసిస్ చేపలు వ్యాధులను తట్టుకుని, ఎలాంటి మేతనైన జీర్ణం చేసుకునే గుణం కలిగి ఉంటాయి. దీంతో వీటికి కోడి వ్యర్థాలు ఆహారంగా వేస్తున్నారు.
కేరాఫ్‌గా చటాకాయి: కై కలూరు మండలం చటాకాయి గ్రామం వ్యర్థాల సాగునకు కేరాఫ్‌గా మారుతోంది. గతంలో నిషేధిత క్యాట్ ఫిష్ సాగుకు అడ్డాగా గ్రామం ఉండేది. అనేక సందర్భాల్లో కోడి వ్యర్థాల వ్యాన్‌లు పట్టుబడ్డాయి. తాజాగా ఆదివారం రాత్రి గ్రామ పెద్దగా చాలామణి అవుతున్న వ్యక్తి చెరువులో కోడి వ్యర్థాలు విడిచిపెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతో అప్పటికే చెరువులో కోడి వ్యర్థాలు చల్లాడు. ఇదే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో ఫంగసీస్ సాగులో కోడి వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం, విజయవాడ నుంచి ఈ వ్యర్థాలు వస్తున్నాయి. హైదరాబాదు, విజయవాడ నుంచి కుళ్ళిన కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో ట్రేలలో తీసు కొచ్చి వినియోగిస్తున్నారు. కోడి వ్యర్థాలు కేజీ రూ. 15కి విక్రయిస్తోండగా, కోడి గుడ్ల ఆమ్లెట్ కేజీ రూ. 20కి కొనుగోలు చేస్తున్నారు. చేపల మేత ఫిల్లెట్ ధరలు కేజీ రూ.40కి చేరడంతో మేత ధరలను తగ్గించుకోడానికి వ్యర్థాల వైపు మళ్ళుతున్నారు.
జీవో 56 అమలులో విఫలం : కోడి వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో చేపల సాగు చేసి పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో 56ను తీసుకొచ్చింది. వీటిని నియంత్రించడానికి చైర్‌పర్సన్‌గా తహసీల్దారు, సభ్యులుగా వీఆర్వో, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్, ఎస్సై, మెంబరు కన్వీనర్‌గా ఫిషరీస్ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ను నియమించారు. చటాకాయిలో వ్యర్థాల సాగుపై కై కలూరు రూరల్ ఎస్సైను వివరణ కోరగా వాహనాన్ని సీజ్ చేశామని, లక్ష పూచికత్తుతో తహసీల్దారుకు బైండోవర్ చేశామన్నారు.
ఆరోగ్యానికి ముప్పు
వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రధానంగా ఇన్‌ఫెక్షన్ సమస్యలు తలెత్తుతాయి. నరాల బలహీనతలు, కడుపునొప్పి, వాంతులతో పాటు ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి.
– డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు,
సూపరింటెండెంటు, ఏరియా ఆస్పత్రి, కై కలూరు.
ఆక్వా రంగానికి చెడ్డ పేరు
కొందరు చేసే తప్పు వల్ల మొత్తం ఆక్వా రంగానికి చెడ్డ పేరు వస్తుంది. పలు సమావేశాల్లో వ్యర్థాలతో సాగు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. కొందరు పెడచెవిన పెడుతున్నారు. కలెక్టరు, ఎస్పీలకు వ్యర్థాల సాగుపై ఫిర్యాదు చేస్తాం.
– నంబూరి వెంకటరామరాజు, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, తాడినాడ
ఆరోగ్యానికి ప్రమాదమంటున్న వైద్యులు
చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు మేతగా కోడి వ్యర్థాలు
జీవో 56 అమలులో అధికారుల విఫలం

చేపల సాగులో కోడి వ్యర్థాలు

చేపల సాగులో కోడి వ్యర్థాలు

చేపల సాగులో కోడి వ్యర్థాలు