
పని లేదు.. నిరుద్యోగ భృతి రాదు
ఏలూరు (మెట్రో): ‘నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాం.. లేదంటే నిరుద్యోగ భృతిగా రు.3 వేలు అందించి అండగా నిలుస్తాం’ ఇవి కూటమి సర్కారు అధికారం కోసం ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు. వాస్తవానికి కూటమి సర్కారు అధికారం చేపట్టి సంవత్సర సమీపిస్తున్నా ఉద్యోగం లేని వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం సర్వే చేస్తున్నామంటూ, సచివాలయ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతూ కూటమి సర్కారు కాలయాపన చేస్తుంది. జిల్లాలో నిర్వహిస్తున్న వర్క్‌ఫ్రమ్ హోం సర్వేలో ఏ పనీ లేని వారి సంఖ్య 6,37,333 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
గత రెండు నెలలుగా చేయిస్తున్న ఈ సర్వేలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.? జనాభా ఎంత? ఏ పని చేయని వారు ఎంతమంది ఉన్నారు. ఇళ్ల వద్ద పనులు చేసేందుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు? అనే అంశాలను క్రోడీకరిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 99.90 శాతం సర్వేను సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే పూర్తి చేశారు. సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ప్రచారం చేస్తున్నప్పటికీ ఇది ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా డిగ్రీ పట్టభద్రులతోపాటు ఇంజినీరింగ్ చేసిన యువతకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కల్పిస్తారని చెబుతున్నారు.
ఉన్న ఉద్యోగాలే తీసేస్తుంటే..
సర్వేలో నివాస గృహాల్లో బ్రాడ్‌బాండ్, వైఫై సదుపాయం, ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉందా, లేదా అన్న వివరాలు సర్వేల్లో నమోదు చేశారు. ఇంటర్‌నెట్ సదుపాయం లేని ప్రదేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైబర్‌నెట్‌పైనే పర్యవేక్షణ కొరవడటంతో కొత్తగా ఇంటర్‌నెట్ సదుపాయం ఎలా కల్పిస్తారనేది ప్రశ్నార్ధకమే. కనీసం ఫైబర్‌నెట్‌లో విధులు నిర్వహించే సుమారు 500 మంది ఉద్యోగాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి కొత్తగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేది కూటమి సర్కారుకే తెలియాలి.
వర్క్‌ఫ్రమ్ హోం సర్వే వివరాలు
జిల్లా వ్యాప్తంగా ఇంతవరకూ చేసిన సర్వేలో 49,0034 గృహాల్ని సందర్శించారు. 10,83,839 మంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారిలో వివిధ పనులు చేస్తున్న వారు 1,93,819 మంది ఉన్నారు. ఏ పని చేయని వారు 6,37,333 మంది ఉన్నారు. ఇంటి వద్ద వివిధ పనులు చేస్తున్న వారు 17,341 మంది ఉన్నారు.
నిరుద్యోగులను మోసగించిన కూటమి
జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారని, నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసిన సర్కారు కనీసం దీనిపై నోరు మెదపడం లేదని సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు.
వర్క్‌ఫ్రమ్ హోం సర్వేలో తేలిన లెక్కలు
జిల్లాలో ఏ పని లేని వారి సంఖ్య 6,37,333 మంది
జిల్లాలో 99.90 శాతం సర్వే పూర్తి