
ఏలూరు ఇందిరమ్మకాలనీ వద్ద అస్థిపంజరం
విచారణ చేస్తున్న ఏలూరు రూరల్ పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఇందిరమ్మకాలనీ పంటకాలువ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం అస్థిపంజరంను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు వేమూరి సత్యనారాయణ (65)గా గుర్తించారు. కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడని, అతని భార్య విజయవాడలోని కుమారుడి వద్ద ఉంటుందని చెబుతున్నారు. మద్యానికి బానిసై పంటకాలువ వద్ద పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతిచెంది సుమారు నెలరోజులు అయి ఉండవచ్చిని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం వ్యాన్ బోల్తా
పోలవరం రూరల్: మద్యం సీసాల లోడుతో వస్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. రాజమహేంద్రవరం జిల్లాలోని డిపో నుంచి పోలవరం మద్యం దుకాణానికి తరలిస్తున్న వ్యాన్ కొత్తపట్టిసీమ, పాత పట్టిసీమ మధ్యలో బుధవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో తీసుకువస్తున్న సుమారు రూ.7 లక్షల విలువైన మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం వ్యాన్ తిరగబడిన సమాచారం మద్యం షాపు యజమానికి అందడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకుని నేలపై పడ్డ మద్యం సీసాలను ఒబ్బిడి చేసుకున్నారు.
పొగాకు బేరన్ దగ్ధం
బుట్టాయగూడెం: కొమ్ముగూడెంలో బుధవారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక పొగాకు బేరన్ దగ్ధమైంది. ఆలపాటి వెంకట రమణమూర్తి అనే రైతు పొగాకు క్యూరింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేశారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్టు రైతు వెంకట రమణమూర్తి తెలిపారు.

ఏలూరు ఇందిరమ్మకాలనీ వద్ద అస్థిపంజరం