
7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 14 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి బుధవారం వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా 7న ఉదయం శ్రీవారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేస్తారు. 8న అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణను నిర్వహిస్తారు. అలాగే 9న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధి సేవలు, 10న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. 11న రాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. 12న రాత్రి రథోత్సవం, 13న చక్రవారి–అపభృధోత్సవము, వేద సభ, ధ్వజావరోహణ నిర్వహిస్తారు. 14న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము–పవళింపుసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చేనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని ఈఓ కోరారు.
11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం
12న రాత్రి రథోత్సవం
ఉత్సవ వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ మూర్తి

7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు