
గోపీనాథపట్నంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం భక్తాంజనేయ స్వామి ఆలయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆయన సతీమణి సౌదిని కుమారి రెండో రోజు ఆదివారం విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠంలో పీఠాధిపతి చేత అభిషేకాలు, పూజలు అందుకున్న శివలింగం ఆదివారం ఇక్కడికి చేరుకుంది. పంచామృతాలతో విగ్రహలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జలాదివాసం నిర్వహించారు. విశేష పూజల నడుమ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోపాలకృష్ణ చక్రవర్తి బ్రహ్మత్వంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.