
ఆశల పల్లకీలో కొల్లేరు
●
● హద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశం
● ప్రభుత్వమే అఫిడవిట్ వేయాలని కొల్లేరు ప్రజల డిమాండ్
● కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేనా?
● అత్యున్నత న్యాయస్థానం సూచనలను అనుకూలంగా మార్చుకుంటున్న నేతలు
● రెగ్యులేటర్ల నిర్మాణం మాటెత్తని కూటమి ప్రభుత్వం
రాజకీయం చేయొద్దు
కొల్లేరు కాంటూరు కుదింపు చేస్తామని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏళ్లు గడిచిపోయాయి. అమాయకులైన కొల్లేరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పాలి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలు చేయడానికి కూటమి నేతలు కృషి చేయాలి.
–బలే గణేష్, శృంగవరప్పాడు, కై కలూరు మండలం
రెగ్యులేటర్లు నిర్మించాలి
కొల్లేరు అభయారణ్యంలో ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో 10వ కాంటూరు వరకు నిబంధనలు విస్తరించాలని చూస్తున్నారు. మరోవైపు కాంటూరు 5 నుంచి 3నకు కుదిస్తానని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు. కొల్లేరులో నీరు లేక ఎడారిగా మారింది. ప్రజల వలసలు తగ్గాలంటే ప్రభుత్వం ముందుగా రెగ్యులేటర్లు నిర్మించాలి.
– ఎల్‌ఎస్ భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండవల్లి మండలం
సాక్షి టాస్క్‌ఫోర్స్: కొల్లేరు అనే ఈ మూడక్షరాల పదం రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు చెబుతున్న సూచనలతో రా జకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీని ఆదేశించింది. కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేసి 19 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అభయారణ్యం ఆక్రమణల చెరలోనే చిక్కుకుంది. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని అధ్యయన కమిటీలు గతంలోనే నివేదిక ఇచ్చాయి. కొల్లేరుకు శాశ్వత పరి ష్కారం చూపుతామంటున్న నేతల వాగ్దానాలు నెరవేరేనా అనే అనుమానాలు కొల్లేరు ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి.
మరోమారు తెరపైకి..
కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ రామ్‌సర్ ఒడంబడిక ప్రకారం 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120ను తీసుకొచ్చింది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో + 5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా నిర్ణయించారు. అక్రమ చేపల చెరువుల సంఖ్య అభయారణ్యంలో పెరగడంతో 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు అమలు చేయలేదని ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో కేసు వేశారు.
ప్రధాని హామీ అమలు చేయాలి
ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కొల్లేరు కాంటూరును కుదిస్తానని హామీ ఇచ్చారు. ఆ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొల్లేరుపై సమావేశం నిర్వహించారు. అనంతరం కాంటూరు కుదింపుపై త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్, రివ్యూ పిటీషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. కాంటూరు కుదింపు జరగాలంటే జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్‌టీడబ్ల్యూఎల్) ఆమోదం కోసం రాష్ట్ర బోర్డు తీర్మానం చేయాల్సి ఉంది. అలాగే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు.
కాంటూరు కుదింపు సాధ్యమయ్యేనా..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. 10వ కాంటూరు పై వరకు కొల్లేరు విస్తరించి ఉన్నప్పటికీ 5వ కాంటూరు వరకు మాత్రమే 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తే 48,777 ఎకరాలు మిగులుతుంది. అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, సొసైటీ భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. గతంలో నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేశారని కొల్లేరు ప్రజలు వాదన వినిపిస్తున్నారు. కొల్లేరుపై అధ్యయనం చేసిన పలు కమిటీలు కాంటూరు కుదింపు సాధ్యం కాదని నివేదికలు అందించాయి. కూటమి నేతలు మాత్రం కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేసినట్లుగానే ప్రచారం చేస్తున్నారు.

ఆశల పల్లకీలో కొల్లేరు

ఆశల పల్లకీలో కొల్లేరు