సాక్షి, యాదాద్రి : భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు జోరు పెంచారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీకి సై అంటున్నారు. భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భువనగిరి నియోజకవర్గంలో టికెట్ ఎవరికన్నది అంతుచిక్కకుండా ఉంది. ఇక్కడి నుంచి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు రేసులో ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం వరకు జిట్టా బాలకృష్ణారెడ్డి టికెట్ రేసులో ఉన్నా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ ఆయనను బీజేపీ బహిష్కరించింది. అధిష్టానం తీరును ఎండగడుతూ జిట్టా విమర్శలు చేయడంతో బీజేపీతో ఆయనకున్న అనుబంధం ముగిసినట్లయింది. ఇక భువనగిరి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు పీవీ శ్యాంసుందర్‌రావు కూడా జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి టచ్‌లో ఉన్నారు.
మరో వైపు నియోజకవర్గంలో జనం మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ టికెట్ బీసీలకు ఇవ్వాలంటూ భువనగిరిలో జరిగిన సమావేశం పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరఽథతో పాటు మరికొందరు నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇంకొందరు కూడా తెరపైకి వస్తున్నారు.
ఆలేరులో ముగ్గురు..
ఆలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్, రాజాపేట మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సూదగాని హరిశంకర్‌గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు పార్టీ కార్యక్రమాలు కలిసి చేస్తూనే.. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఆలేరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాసం వెంకటేశ్వర్లు కూడా టికెట్ వేటలో ఉన్నారు. కాగా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్, బండ్రు శోభారాణిలు బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీకి ఆలేరులో పెద్ద దిక్కు లేకుండా పోయింది.
మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి!
మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా సాధారణ ఎన్నికలో మాత్రం రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే విజయం సాఽధిస్తారనే చర్చ సాగుతోంది. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. అయితే, తాను పార్టీ మారడం లేదని పలు మార్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment