నేడు బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో రైతు మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొంటారు. గడియారం సెంటర్‌లో మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు మూడు గంటలు అనుమతించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించాలి. మహాధర్నాను ఈనెల 12న నిర్వహించాల్సి ఉండగా.. సంక్రాంతి నేపథ్యంలో వాయిదా వేసుకుంది. తిరిగి ఈ నెల 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాక పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉన్నందున బందోబస్తు కల్పించలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు అదేరోజు హైకో ర్టును ఆశ్రయించగా 27వ తేదీ ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చింది. కాగా 27న కాకుండా 28వ తేదీన అనుమతికి బీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు.. 1,500 మందితో ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
భారీ ఏర్పాట్లు
మహాధర్నాకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.
నల్లగొండలో భారీ ఏర్పాట్లు
హాజరుకానున్న కేటీఆర్, పార్టీ నేతలు
రైతుకు భరోసా ఇచ్చేందుకే మహా ధర్నా
రైతులు మొదటి నుంచీ బీఆర్‌ఎస్ వెంటే ఉన్నారు. వారిని ఆత్మహత్యల నుంచి బయట పడేసింది బీఆర్‌ఎస్ పార్టీనే. ప్రస్తుతం రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందరికీ రుణ మాఫీ చేయలేదు. రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని తగ్గిస్తున్నారు. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామసభల్లో నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు, ప్రజలకు అండగా ఉంటుంది. అందులో భాగంగానే రైతులకు భరోసా ఇచ్చేందుకు మహా ధర్నా చేపట్టబోతున్నాం. నల్లగొండ నుంచి రైతుల తరఫున పోరాటం చేసేందుకు కేటీఆర్ వస్తున్నారు. బీఆర్‌ఎస్ ధర్నా అంటేనే జిల్లా మంత్రి, కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారు.
–జగదీశ్‌రెడ్డి మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment