అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్‌రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment