
దగ్ధమవుతున్న గడ్డివాములు
బద్వేలు అర్బన్ : నారాలోకేష్ యువగళం పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా విద్యానగర్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే కార్యకర్తలు టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి విద్యానగర్ సమీపంలో ఆర్.విజయమ్మ, ఆర్.నాగమ్మలకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి.
స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. వేసవికాలం పశువులకు మేత దొరకని కష్ట సమయంలో ఉన్న గడ్డివాములు దగ్ధమవడంపై మహిళలు బోరున విలపించారు. ఈ ఘటనలో సుమారు రూ.70 వేలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.