ఆ నలుగురు టీడీపీ ఇన్‌చార్జీలు.. సీటు తేడా కొడితే పార్టీకి పనిచేస్తారా..? | - | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు టీడీపీ ఇన్‌చార్జీలు.. సీటు తేడా కొడితే పార్టీకి పనిచేస్తారా..?

Published Tue, Jan 30 2024 12:58 AM | Last Updated on Tue, Jan 30 2024 10:23 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల నోటిఫికేషన్‌ రాకున్నా అధికార వైఎస్సార్‌సీపీ దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ అంతర్మథనంలో ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలకు టికెట్‌ దక్కకపోతే, టీడీపీకి పనిచేస్తారా? లేదా? అన్న సందిగ్ధత ఆ పార్టీలో కొనసాగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు చోట్ల అలాంటి పరిస్థితే ఉంది. మెరుగైన అభ్యర్థులు లభించి, సీన్‌ మారితే రివర్స్‌ గేర్‌ అందుకుంటారా అన్న అనుమానం లేకపోలేదు. వెరశి వీళ్లకు టికెట్‌ ఉన్నట్టా...లేనట్టా...అన్న సందేహాం లేకపోలేదు. అపార ప్రజామద్దతు, విజయావకాశాలను బేరీజు వేసుకొని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. 

అలాంటి ధీమా తెలుగుదేశం పార్టీలో కనిపంచడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం మినహా వారే అభ్యర్థులని ప్రకటించడం లేదు. ఇటీవల రా...కదలిరా కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అధినేత చంద్రబాబు అభ్యర్థించారే తప్ప, అభ్యర్థులుగా వీరి విజయానికి కృషి చేయాలని పేర్లు చెప్పలేకపోయారు. ఏక నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో కూడా అదే దాటవేత ధోరణినే అవలంభించారు. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పుడున్న వారి కంటే మెరుగైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సింగిల్‌ నాయకత్వం ఉన్న చోట కూడా అభ్యర్థిగా ప్రకటించలేకపోతున్నారని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

ఆ నాలుగు చోట్లా సంకటమే...
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు తర్వాత జిల్లా నేతల మధ్య సర్దుబాటు సాధ్యమౌతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ఉండిపోయింది. కడప నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాధవీరెడ్డి నియామకం అయ్యాక, ఆమె పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. తనకే టికెట్‌ అన్న ధీమాతో జనంలోకి వెళ్తున్నారు. కాగా 2019లో పోటీచేసిన మైనార్టీ నేత అమీర్‌బాబు, 2014లో పోటీచేసిన దుర్గాప్రసాద్‌, ప్రస్తుతం టికెట్‌ ఆశిస్తున్న కార్పొరేటర్‌ ఉమాదేవి (జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కోడలు) ఒక జట్టుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు.

 మాధవీరెడ్డికి టికెట్‌ కేటాయిస్తే వీరంతా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల రా..కదలిరా కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుతో కార్పొరేటర్‌ ఉమాదేవి గెలిచే వారికే టికెట్‌ ఇవ్వండి సార్‌..అంటూ బాహాటంగా కోరడం విశేషం. వైరి పక్షాన్ని కలుపుగోలుగా వెళ్లలానే ఆలోచన ఇన్‌చార్జి మాధవీరెడ్డిలో కూడా కన్పించడం లేదని పరిశీలకుల భావిస్తున్నారు. అదే సమయంలో మాధవీరెడ్డికి సహకరించే పరిస్థితి ఆ ముగ్గురు నాయకుల్లో కనిపించడం లేదని పలువురు అభిప్రాయడుతున్నారు.

ప్రొద్దుటూరు అభ్యర్థిత్వాన్నిప్రకటించుకున్న ప్రవీణ్‌...
ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి టికెట్‌పై ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలతో పాటు, రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌లు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నలుగురిలో చినబాబు ప్రవీణ్‌ వైపు మొగ్గు చూపుతుండగా, పెద్దబాబు డైలమాలో ఉన్నారు. ఒకరికిస్తే కనీసం ఇద్దరు విబేధించే పరిస్థితి లేకపోలేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అంతంత మాత్రపు పోటీ ఇవ్వగలరని, ఇలాంటి పరిస్థితిలో ఏకాభిప్రాయం ఎలా సాధించాలనే సందిగ్ధత టీడీపీలో కనిపిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

 కాగా సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలో టీడీపీ అభ్యర్థిగా గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనకు తానుగా పోస్టర్లు వేసుకున్నారు. ఈవ్యవహారంపై అటు మాజీ ఎమ్మెల్యే వరద వర్గీయులు, ఇటు లింగారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకపక్షంగా అభ్యర్థిగా ప్రకటించుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు. ప్రొద్దుటూరు టీడీపీలో తాజాగా అభ్యర్థిత్వం అగ్గి రాజుకుంది. ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

పుత్తా పేరు ఎత్తని చంద్రబాబు...
కమలాపురం కేంద్రంగా ఈనెల 19న రా...కదలిరా కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారు. అక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిని ఈ మారైనా గెలిపించాలని అధినేత చంద్రబాబు సూచించకపోవడం చర్చనీయాంశమైంది. వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలైన పుత్తా స్థానంలో మరెవ్వరినైనా దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా? ఆ కారణంతోనే పుత్తా పేరు ప్రకటించలేదా? మెరుగైన అభ్యర్థి లభించి తెరపైకి తీసుకువస్తే పుత్తా సహకరిస్తారా? అనే సందేహం కూడా టీడీపీని వెంటాడుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో పుత్తాకు తెలియకుండానే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని తాజాగా టీడీపీలో చేర్చుకున్నారు. 

ఇక్కడ కూడా టికెట్‌ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అదే పరిస్థితి రాయచోటిలో ఉంది. ప్రస్తుత ఇన్‌చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి 2014, 19ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈమారు టికెట్‌ తనకే లభిస్తుందనే ధీమాతో ఉన్నారు. కాగా ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసీ ప్రసాద్‌బాబు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. గడికోట ద్వారకా నందమూరి కుటుంబంతో ఉన్న బంధుత్వం (దివంగత నందమూరి తారకరత్న) కారణంగా తనకే టికెట్‌ లభిస్తుందనే భావనతో వర్గ సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కూడా ఈమారు టికెట్‌ దక్కుతోందనే ధీమాగా ఉన్నారు. వీరిలో ఒక్కరికి టికెట్‌ లభిస్తే, మరొకరు సహకరించే పరిస్థితి కన్పించడం లేదని పరిశీలకుల అంచనా. ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలనే ఆలోచనలో టీడీపీ ఉండిపోయిందని పలువురు చెప్పుకొస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement