రాజంపేట: చీతా..ఈ భూమ్మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. ఇప్పుడు దీని చూపు మదనపల్లె వైపు పడింది..అంటే చీతాలను పునరుత్పత్తి కేంద్రంగా ఎంపిక చేసుకోవాలనే భావన డబ్ల్యూఐఐ తెరపైకి తీసుకొచ్చినట్లు అటవీవర్గాల సమాచారం. 1965లో ఒక సారి చీతా కనిపించింది. ఆ తర్వాత ఈ జాతి కనుమరుగైంది.భారత్‌లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్టు చేపట్టారు. 2022లో నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్(మధ్యప్రదేశ్)లోకి వదిలిన సంగతి తెలిసిందే.
► అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టెరన్ ఏరియా విస్తారంగా ఉండటంతో..ఆ ప్రాంతంలో చీతా పునరుత్పత్తికి దోహదపడుతుందనే యోచనలో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త రమేష్ ఉన్నట్లు అటవీవర్గాలకు సమాచారం అందింది. ఈనెల 25న చీతా పునరుత్పత్తిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందని అటవీవర్గాలు చెబుతున్నాయి.
► 70వేల హెక్టార్ల అటవీ ప్రాంతం కలిగిన మదనపల్లె రేంజ్ ప్రాంతం టెరన్ ఏరియాగా పిలుస్తారు. 18 మండలాలు ఉన్నాయి. కొండ, గట్టు, గడ్డి విపరీతంగా పెరగడం లాంటి ప్రదేశాలు ఉన్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అందువల్ల చీతాల పునరుత్పత్తి ఉండటానికి అనుకూల ప్రదేశంగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. అటు కర్ణాటక, ఇటు చిత్తూరు, మరోవైపు సత్యసాయి జిల్లాలతో టెరన్ ప్రాంతం ముడిపడి ఉంటుంది.
► చీతా అనే పదం..హిందుస్ధానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని. చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్ చీతాలు, ఆసియాటిక్ చీతాలు, నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ చీతాలు, నార్త్‌వెస్ట్ చీతాలు. చీతా గర్జిస్తుందని పొరపాటు పడొద్దు. దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల అది గర్జించలేదు. పిల్లిలాగే మియావ్ అని, లేదంటే పిష్ అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది.
► చీతా వేట నిమిషం కంటే వ్యవధిలోని ముగిస్తుంది. ఇది ఎంతలా అంటే స్పోర్ట్స్ కారుకంటే వేగంగా. చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ. అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగుతీసింది.
►చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం. అందుకే కుందేళ్లు, జింకలను వేటాడుతాయి. పెద్దవాటి జోలికి ఎక్కువగా పోవు. ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకొని త్వరగా తినేస్తాయి.
మదనపల్లె ప్రాంతం అనుకూలం
చీతా జీవించడానికి .. వాటి మనుగడకు మదనపల్లె అటవీ ప్రాంతం అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనిపై పరిశోధన నిమిత్తం డబ్ల్యూఐఐకి చెందిన చీఫ్ సైంటిస్టు రమేష్ ఈ అంశం గురించి ప్రస్తావించారు. ఈనెల 25న సమావేశం ఉంటుందని సమాచారం అందింది. –వివేక్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment