మైలవరం : మండల పరిధిలోని తొర్రివేముల గ్రామంలో రైతు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మప్ప (36)అనే వ్యక్తికి ఏడు ఎకరాల పొలం ఉండగా తొర్రి వేముల గ్రామ సమీపంలో ఉన్న నొస్సం బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న పంట పొలంలో మిరప పంటను సాగు చేసుకుంటున్నాడు. చాలా మంది రైతులు బ్రాంచ్ కెనాల్‌లో నుంచి నీటిని మళ్లింపుకోసం ప్రత్యేక మోటర్లను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు తిమ్మప్పకు కూడా మోటారు ఉండటంతో ఉదయం పంటకు నీరు అందించాలని పొలానికి వెళ్లాడు. అయితే స్టాటర్ల జాయింట్ అయి ఉండటం వల్ల మోటారు వేయబోతు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడని ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలతోపాటు భార్య ఉన్నారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు ఆవుల వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోన్‌లో మృతుని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి ప్రకటించారు.
నాలుగు బైక్‌లు స్వాధీనం
పోరుమామిళ్ల : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన నాలుగు బైకులను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం సాయంత్రం పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలో బైకు చోరీకి గురైందని స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రం సీతారామపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన బైకును గుర్తించామన్నారు. దొంగిలించిన బైక్‌పై వెళుతున్న లూజరయ్య, రవీంద్రలను విచారించగా చోరీలను ఒప్పుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని కడప రిమ్స్, కడప టౌన్, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ళ పట్టణంలో దొంగిలించిన నాలుగు బైక్‌లను బొప్పాపురం గ్రామానికి సమీపంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ కొండారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment