గండి కొడతారా.. కోట కడతారా!
కడప కల్చరల్: కూటమి ప్రభుత్వం జిల్లా పర్యాటకాభివృద్ధికి పథకాల ఊరింపుతోనే సరిపెడుతోంది. ప్రణాళికల పేరిట గడువు పెడుతూ కాలయాపన చేస్తోంది. జిల్లా పర్యాటకంపై ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తూ.. అమల్లోకి వచ్చేసరికి రిక్తహస్తం చూపిస్తోంది. తాజాగా గురువారం సంబంధిత మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లా పర్యాటకానికి కూడా పలు వరాలు కురిపించారు. ప్రధానంగా గండికోటపై దృష్టి సారించారు. దేశంలోనే ఇలాంటి ప్రాంతం లేదని, ఈ అద్భుతమైన ప్రాంతం వన, జల, గిరిదుర్గంగా ప్రాధాన్యత సంతరించుకుందని ప్రశంసించారు. గండికోటను బ్రాండింగ్ చేయాలని, టెంట్ సిటీగా ప్రకటించాలని కూడా సూచించారు. సాస్ కీ పథకంలో భాగంగా గండికోటను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇప్పటికే గండికోటను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. జిల్లాలోని పెద్దదర్గా, గండికోట, ఒంటిమిట్ట, సోమశిల ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్లో చోటు కల్పించారు. ఇంకా జిల్లాకు సంబంధించి పర్యాటకంగా పలు పథకాలు సూచించారు. పథకాల ఊరింపు బాగానే ఉంది.. వీటి అమలు ఎప్పుడని పర్యాటకాభిమానులు ప్రశ్నిస్తున్నారు. కోటలు దాటే మీ మాటల్ని కట్టిపెట్టి... ఈసారైనా వాటిని అమలు చేయండి బాబూ.. అంటూ విన్నవిస్తున్నారు.
అభివృద్ధి ఎలా?
పర్యాటకరంగంలో ఆతిథ్యరంగం విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉందని, వీటిని పర్యాటకులకు స్వర్గధామంగా మలిచి ఈ సంవత్సరం 20 శాతం అభివృద్ధి రేటు సాధించాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. కానీ ఆయన హయాంలో ఇంతవరకు జిల్లాలో ఒక్క పర్యాటక హోటల్ నిర్మించిన దాఖలాలు లేవు. మహానేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో జిల్లాలో ‘హరిత’పేరిట ఏడు పర్యాటక హోటళ్లను నిర్మించి పర్యాటకం అన్న పదానికి ఎనలేని గ్లామర్, ప్రాధాన్యత కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కడప నగరంలోని ప్రధాన హరిత హోటల్‌ను మరమ్మతుల పేరుతో ఆర్నెళ్లుగా పలు గదులను వసతికి దూరం చేయడం గమనార్హం. ప్రతి పథకానికి ప్రణాళిక దశలోనే కనీసం మూడు మాసాలు గడువు పెడుతుండడం ఆర్థికంగా ఎలాంటి విడుదల లేకపోవడంతోనే ఇంత కాలయాపన జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి.
టెంట్ సిటీగా...?
గండికోటకు వస్తున్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఉన్న పర్యాటకశాఖ హోటల్ గదులు చాలక అన్ సీజన్‌లో 600–700 టెంట్లు వేస్తున్నారు. సీజన్‌లో వెయ్యికి పైగా డిమాండ్ ఉంది. కానీ ఆ మేరకు ఆదాయం మాత్రం కనిపించడం లేదు. పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణం.
గండికోట ఉత్సవాలేవీ?
ఇంతకుముందు వరుసగా గండికోట వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంతో దానికి ఎనలేని ప్రచారం లభించింది. దీని ప్రత్యేకతలు తెలుసుకున్న వారంతా దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా కొనియాడుతూ యునెస్కో గుర్తింపుకోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకపోవడం వారి చిత్తశుద్ధి లోపానికి నిదర్శమని ఈ ప్రాంత పర్యాటకాభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
● గత పథకాల మాటేమిటి?
పర్యాటక అభివృద్ధికి
సీఎం నోట ‘గండికోటకు బ్రాండింగ్ స్టేటస్’
గతంలో చెప్పిన వాటికే మోక్షం లేదని పర్యాటకాభిమానుల నిట్టూర్పు
ప్రణాళికల పేరుతో కాలయాపన చేయొద్దని విన్నపం
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలపై జిల్లా పర్యాటకాభిమానుల్లో నమ్మకం సన్నగిల్లింది. ఇంతకుముందు అధికారం (2014–19)లో ఉన్నప్పుడు గండికోటను అభివృద్ధి చేస్తామని ఇలాంటి వాగ్దానాలే చేశారు. రోప్‌వే ఏర్పాటు చేస్తామని చెప్పడంతోపాటు కొద్దిగా సామాగ్రిని కూడా తెప్పించి హడావుడి చేశారు. ఆ తర్వాత ఆయనగానీ, సంబంధిత అధికారులుగానీ దాని గురించి పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు చూస్తాం...చేస్తాం అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారేగానీ చేసిన వాగ్దానం మాత్రం కార్యరూపంలోకి రాలేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ట్రెక్కింగ్ అభివృద్ధి ఎంపిక చేసినట్లు చెబుతున్నా గండికోటలో అంతకుముందే నిర్మించిన అడ్వెంచరస్ అకాడమి అభివృద్ధిపై కూడా ఏమాత్రం దృష్టి సారించలేదు. దీంతో ఇన్‌స్టిట్యూట్ కార్యాచరణ లేక వెలవెలబోతోంది.
గండి కొడతారా.. కోట కడతారా!
Comments
Please login to add a commentAdd a comment