శవం పూడ్చే విషయంలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పూడ్చే విషయంలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ నాయకులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు బద్వేలు – కడప రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరకు పోలీసు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఎట్టకేలకు గ్రామస్తులు శవాన్ని పూడ్చివేశారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని భాకరాపేట సమీపంలోని చెన్నంపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 1580లో గల చెరువు పోరంబోకు స్థలంలో ఆరు నెలల క్రితం సీపీఐ నాయకులు గుడిసెలు వేయించారు. సదరు స్థలాన్ని భాకరాపేట, విద్యానగర్, బయనపల్లె గ్రామాలకు చెందిన వివిధ కులాల వారు శ్మశానంగా వినియోగిస్తున్నారు. అయితే ఆదివారం భాకరాపేట గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సీపీఐ నాయకులు వేసిన గుడిసెల వద్దకు తీసుకెళ్లారు. ఇక్కడ శవాన్ని పూడ్చవద్దంటూ సీపీఐ నాయకులు, గుడిసెవాసులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకోవడంతో భాకరాపేట గ్రామానికి చెందిన సుబ్బరామయ్య, శివ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు బద్వేలు – కడప రహదారిలోని విద్యానగర్ సమీపంలో రోడ్డుపై ముళ్లకంచె వేసి బైఠాయించి ఆందోళన చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్, రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గ్రామస్తులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. తిరిగి శవాన్ని పూడ్చే క్రమంలో చెరువు పోరంబోకు స్థలం వద్దకు వెళ్లగా తిరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే స్థలాన్ని శ్మశానంగా ఉపయోగించుకుంటున్నామని, ఇప్పుడు శవాన్ని పూడ్చవద్దంటే ఎలా అని గ్రామస్తులు సీపీఐ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సీపీఐ కాలనీకి చెందిన శ్రీను అనే యువకుడు శవాన్ని ఇక్కడ పూడ్చితే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోలు మీద పోసుకుని హల్‌చల్ చేశాడు. ఇంతలో పోలీసులు అప్రమత్తమై సదరు యువకుడిని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఇది చెరువు పోరంబోకు స్థలమని తేల్చారు. ఇదే సమయంలో గ్రామస్తులంతా ఏకమై సదరు చెరువు పోరంబోకు స్థలంలోనే శవాన్ని పూడ్చిపెట్టారు. తిరిగి ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సీపీఐ నాయకులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ
రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
పోలీసులు, రెవెన్యూ అధికారుల
జోక్యంతో సద్దుమణిగిన వివాదం
Comments
Please login to add a commentAdd a comment