●బకాయిలకే గత బడ్జెట్
బి.కొత్తకోట: హంద్రీ–నీవా ప్రాజెక్టులోని ప్రధాన కాలువ, ఉపకాలువలు, రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పారాలంటే 2025–26 బడ్జెట్‌లో కోరినంత నిధులు ఇవ్వాలి. కరువు రైతుల కల్పతరువైన సాగు, తాగునీటి ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తుందా లేక మొక్కుబడి నిధులతో మొండిచెయ్యి చూపుతుందా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులనే కేటాయింపులు చేసి చేతులు దులుపు కుంటుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు కృష్ణా జలాలు అందిస్తారన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంత నిధులను బడ్జెట్‌లో కేటాయించలేదు. దీంతో పనులు ముందుకు సాగడంలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పథకాలను కూటమి ప్రభుత్వం కక్షకట్టి రద్దు చేసేసింది. వారికి అనుకూలమైన పనులు చేపట్టి నిధులను ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటుతో చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు ఆశించినంత ఇస్తారా లేదా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రూ.3,500 కోట్లు ఇవ్వండి
హంద్రీ–నీవా ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ ఉమ్మడిజిల్లాల్లో సాగుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న, చేపట్టబోయే పనులకు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు పంపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కాలువ వెడల్పు చేయడం, కొన్ని కాంక్రీటు, మట్టి పనులు రూ.1,240 కోట్లతో చేపట్టారు. ఇదికాక ప్రధాన కాలువకు సంబంధించి మరో రూ.503 కోట్లతో పనులు సిద్దం చేశారు. ఈ మొత్తం పనులకే రూ.1,700 కోట్లు కావాలని నివేదించారు. ఇవికాక కర్నూలు జిల్లాకు రూ.450 కోట్లు పోను, మిగిలిన రూ.1,350 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనులను ఈ నిధులతో చేపట్టాల్సి ఉంటుంది.
ఉమ్మడి చిత్తూరుకు రూ.2 వేల కోట్లు కావాలి
విభజిత అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఇంచుమించు రూ.2 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇందులో ప్రాజెక్టులో అసంపూర్తి పనులు చేపట్టి పూర్తి చేసేందుకు రూ.729 కోట్లు అవసరం ఉందని అధికారిక నివేదిక చెబుతోంది. ప్రాజెక్టులో భాగమైన ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కాలువలు, స్ట్రక్చర్స్‌లో పెండింగ్‌లోని పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిధుల్లో రూ.250 కోట్లతో ప్రధానకాలువపై చిన్నమండెం మండలం పడమటికోన, కలకడ వద్ద కాలువ తవ్వకం, 12 చోట్ల కాంక్రీటు నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే కానీ అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వెళ్లవు. ఈ రూ.250 కోట్ల నిధులకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు.
●లైనింగ్‌కే రూ.684 కోట్లు
●వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిధులే ఇస్తారా?
హంద్రీ–నీవా ప్రాజెక్టు మొత్తానికి రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన
ప్రాజెక్టు పెండింగ్ పనులకు రూ.729 కోట్లు అవసరం
2024–25 బడ్జెట్ బకాయిలకేసరిపెట్టిన ప్రభుత్వం
కృష్ణాజలాలు పారాలంటేపుష్కలంగా నిధులు ఇవ్వాలి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిధులే కేటాయించే అవకాశం
పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కాలువకు లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం నుంచి చిత్తూరుజిల్లాలోని పెద్దపంజాణి మండలం వరకు పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులను రూ.480 కోట్లతో, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు కుప్పం ఉపకాలువకు రూ.204 కోట్లతో లైనింగ్ పనులను చేపట్టారు. ఇదికాక కుప్పం కాలువకు సంబంధించి ఇంకా రూ.59 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆరునెలల్లో ఈ లైనింగ్ పనులు పూర్తి జరగాలంటే బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి. ఇప్పటికే కృష్ణా జలాల తరలింపుని నిలివేసిన ప్రభుత్వం లైనింగ్ పనులకు నిధులు ఇవ్వకుంటే రైతులు నష్టపొవాల్సి వస్తుంది. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కుప్పానికి రూ.535 కోట్లతో యామిగానిపల్లె వద్ద 0.7 టీఎంసీలు, మాదనపల్లె వద్ద 0.3 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని బడ్జెట్‌లో అనుమతి ఇస్తారో లేదో చూడాలి.
2014–15 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.611 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పనులు జరగడం కంటే బకాయిల చెల్లింపుకే సరిపోయింది. ఇప్పటిదాకా రూ.400 కోట్లు చెల్లించగా మిగిలిన నిధులతో మరోనెలలో జరిగే అభివృద్ధి పనులు పెద్దగా ఉండకపోవచ్చు. పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే.. మదనపల్లి సర్కిల్‌లోనూ ఉన్నాయి. ఇవికాక ఎత్తిపోతల పథకాల కోసం వినియోగించిన విద్యుత్‌కు రూ.4 వేల కోట్ల మేరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాదిలో రూ.450 కోట్ల మేర చెల్లించగా వచ్చే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలో కోరారు.
2015–26 బడ్జెట్ కేటాయింపు విషయంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసి, వినియోగించుకోని నిధులను మిగులుగా చూపిస్తోంది. ఇవే నిధులను కొత్త బడ్జెట్‌లో కేటాయించే అవకాశం లేకపోలేదు. పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) విస్తరణ పనులకు 2020లో సీఎం వైఎస్.జగన్ నిధులు మంజూరు చేయగా రూ.1,217 కోట్లతో కాంట్రాక్టర్‌కు పని అప్పగించి ఒప్పందం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కాలువకు రూ.480 కోట్లతో లైనింగ్ పని చేపట్టింది. దీనికి సంబంధించి జారీ చేసిన జీవోలో రూ.1,217 కోట్ల పనిలో మిగులు నిధులు ఉన్నాయని, వాటిలో రూ.480 కోట్లతో లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టంగా పేర్కొంది. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో ఇంకా రూ.1,177 కోట్లు మిగులు నిధులు అందుబాటులో ఉన్నట్టు లెక్క.కుప్పం రిజర్వాయర్ల కోసం మంజూరు చేసిన మరో రూ.535 కోట్లు వినియోగించుకోలేదు కాబట్టి ఈ నిధులను మిగులుగా చూపవచ్చు. కాబట్టి ఎలా చూసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులే వచ్చే బడ్జెట్‌లో కేటాయింపు ఉండొచ్చన్నది స్పష్టం అవుతోంది.
●బకాయిలకే గత బడ్జెట్
●బకాయిలకే గత బడ్జెట్
●బకాయిలకే గత బడ్జెట్
Comments
Please login to add a commentAdd a comment