
ఒక్క హామీనైనా అమలు చేశారా?
కమలాపురం : కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతున్నా ఒక్క హామీనైనా అమలు చేసిందా? అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌తో పాటు 143 వాగ్ధానాలు చేశారని, అయితే వాటిలో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. సామాజిక భద్రత పింఛన్ల పై సర్వేలు నిర్వహించి 1.80 లక్షల పింఛన్లు తొలగించి రూ.1000 పెంచడం ఏంటని నిలదీశారు. మరో 7–8 లక్షల పింఛన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బు ఏమి చేశారని ప్రశ్నిస్తే చెప్పే నాథుడే కరువయ్యాడన్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం ఉనికే లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడైతే లంచాలు, కమీషన్లు వస్తాయో అక్కడ ఆ నిధులను ఉపయోగించి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారన్నారు. వైఎస్ జగన్ 12–13 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు అబద్ధాలు చెప్పి రాధ్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు రూ.56వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు అధికారం చేపట్టి దిగిపోయే నాటికి రూ.3.78 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. అనంతరం జగనన్న అధికారంలోకి వచ్చి దిగిపోయే నాటికి రూ. 6లక్షల కోట్లు అప్పు ఉంటే జగనన్న ఎంత అప్పు చేశారో ప్రజలందరికి తెలుసన్నారు. అయితే ఆ అప్పుతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం అన్ని అమ్ముకుంటున్నారని, లోకల్ ట్యాక్స్‌లు విధించి సొంత ఖజానాలు నింపుకుంటున్నారని మండిపడ్డారు. మూడు సార్లు సీఎం, అపార అనుభవం అంటున్న చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి తన బినామీలకు సంపద సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా చక్కెర పరిశ్రమలు, కోఆపరేటివ్ తదితర వాటిని ప్రైవేట్ పరం చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జగనన్న హయాం వరకు కేవలం 11 మెడికల్ కళాశాలు ఉండేవని, జగనన్న 17 కళాశాలలను తీసుకువచ్చి వాటి సంఖ్య 28కు పెంచగా వాటిలో అడ్మిషన్లు వద్దని చెప్పిన అనుభవజ్ఞుడు చంద్రబాబు అని విమర్శించారు. రిజిస్ట్రేషన్, కరెంట్ చార్జీలు పెంచడం సంపద సృష్టించడమా అని అడిగారు. మెనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనన్నారు. తాము పోరాటాలు చేసైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, గంగాధర్ రెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, కొండారెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, సునీల్‌రెడ్డి, ఇస్మాయిల్, ఆంజనేయరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామలక్ష్మీరెడ్డి, రాజారెడ్డి, మోనార్క్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ గాలికి వదిలేశారు..
పింఛన్‌లో కోతలు పెట్టి
రూ.1000 పెంచారు
ప్రతి నెలా సంక్షేమ పథకాల
అమలు జగనన్న ఘనతే
మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment