
రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన
బద్వేలు అర్బన్ : పట్టణ పరిధిలోని భాకరాపేట సమీపంలో సీపీఐ ఆధ్వర్యంలో వేసిన గుడిసెలలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనకు రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు. సోమవారం భాకరాపేట గుడిసెలలో మృతదేహాన్ని పూడ్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్మశానాలు, గ్రామాల అభివృద్ధికి సీపీఐ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే ఆదివారం చోటు చేసుకున్న ఘటన బాధాకరమని అన్నారు. కేవలం కొందరు భూకబ్జాదారులు మృతురాలి బంధువులను రెచ్చగొట్టి ఘర్షణ జరిగేలా చేశారని, తాము గ్రామస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు. గత నెల రోజులుగా భాకరాపేట గుడిసెలను తొలగించాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగంపై కొందరు ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని అన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలోనే జనావాసాల మధ్య మృతదేహాన్ని పూడ్చివేసిన ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే రెవెన్యూ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పట్టణంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కంచెలు వేసిన వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బాదుల్లా, ఏరియా సహాయ కార్యదర్శి మస్తాన్, ఏరియా కార్యవర్గ సభ్యులు బాలు, పి.వెంకటరమణ, పి.వి.రమణ, ఇమ్మానియేల్, పెంచలయ్య, విజయమ్మ, నాయకులు నాగరాజు, వెంకటేష్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర
Comments
Please login to add a commentAdd a comment