
వక్ఫ్‌బోర్డు స్థలంపై కన్నేశారు
ప్రొద్దుటూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్‌బోర్డు స్థలాన్ని లీజు రూపంలో తక్కువ ధరకు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నేతలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. వక్ఫ్‌బోర్డుకు సంబంధించి ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లె మసీదు పరిధిలో సుమారు 27 ఎకరాల పొలాలు, స్థలాలు ఉన్నాయి. ఇందులో కోట్ల రూపాయల విలువైన స్థలాలు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఎక్కువగా ఉన్నాయి.
కమర్షియల్ ఏరియాలో..
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికంగా వక్ఫ్‌బోర్డుకు సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాదిలో 9 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వక్ఫ్‌బోర్డుకు సంబంధించి సర్వే నంబర్ 293/2లో 39 సెంట్ల స్థలం ఉంది. మొత్తం 40 సెంట్ల స్థలంలో సెంటు స్థలం బైపాస్ రోడ్డు నిర్మాణానికి పోగా మిగిలిన 39 సెంట్లు అలాగే ఉంది. గతంలో వక్ఫ్‌బోర్డు అధికారులు తమ స్థలమని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి ఎదురుగా ప్రముఖ థియేటర్ ఉంది. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం కమర్షియల్ హబ్‌గా మారింది. కోట్ల రూపాయల విలువైన స్థలం కావడంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి పరిధిని పెంచారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వక్ఫ్‌బోర్డు అధికారులు ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వరాదని నిర్ణయించారు.
లోపాయికారి ఒప్పందం..
తాజాగా ఈ స్థలాన్ని వెలవలి హుస్సేన్ పీరా అనే వ్యాపారి తక్కువ ధరతో లీజుకు తీసుకునేందుకు దరఖాస్తు చేశారు. లోపాయికారిగా టీడీపీ నేతలతో ఒక ఒప్పందం జరిగినట్లు సమాచారం. మోడంపల్లె మసీదు మేనిజింగ్ కమిటీ ద్వారా ఈ దరఖాస్తును విజయవాడలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి పంపారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో మైనారిటీ సంస్థల ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించారు. బయటికి తెలియకుండా ఒకే దరఖాస్తును తీసుకుని ఎలా పంపారని ప్రశ్నించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజే మోడంపల్లె మసీదులో ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయమై నోటీసు బోర్డులో పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ థియేటర్ యజమాని స్థలాన్ని తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మోడంపల్లె మసీదు మేనేజింగ్ కమిటీ కార్యదర్శి షకిల్ అహ్మద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా గతంలో వెలవలి హుస్సేన్ పీరా నుంచి వచ్చిన దరఖాస్తును వక్ఫ్‌బోర్డు కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. నెలకు రూ.40వేలు చొప్పున లీజుకు ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేశారన్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు ఈ స్థలం కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయంపై తుది నిర్ణయం వక్ఫ్‌బోర్డు పరిధిలో మాత్రమే ఉంటుందని, తమకు సంబంధం లేదన్నారు.
రూ.కోట్లు విలువైన స్థలాన్ని
చౌకగా కొట్టేసే యత్నం..
టీడీపీ నేతల క్రియాశీలక పాత్ర
Comments
Please login to add a commentAdd a comment