
ఉత్సవాలకు వేళాయె.. సందడి లేదాయె ?
ప్రముఖ శైవ క్షేత్రంగా కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. అంత వైభవం కలిగిన త్రేతేశ్వరుడి వేడుకల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మహాశివరాత్రి మహోత్సవాల సందడి కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దేవస్థానంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి.
రాజంపేట రూరల్ : ఉమ్మడి జిల్లాలలో ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాలకులు ఎవరైనా ఈ ఆలయానికి ప్రత్యేకత చూపడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది బహుదా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. అగస్తేశ్వర మహర్షి ప్రతిష్ఠించిన త్రేతేశ్వరస్వామి, గదాధర స్వామిని దర్శించుకోవడం వరంలా భావిస్తారు. దీంతోపాటు అత్తిరాలలోనూ ఏటా శివరాత్రి ముందు రోజు, తరువాత రోజు, శివరాత్రి పర్వదినం రోజున పలు కార్యక్రమాలు చేపడతారు.
పాలక మండలి ఏర్పాటు ఎప్పుడో?.
త్రేతేశ్వర దేవస్థానంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు ముందే పాలక మండలి ఏర్పాటుచేయడం ఆనవాయితీ. అలా వీలుకాని పక్షంలో తాత్కాలిక చైర్మెన్‌ను నియమించి శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవస్థానం చైర్మన్ పదవి, పాలక మండలిపై మందరం, అత్తిరాల, అప్పయ్యరాజుపేట, పోలీ, సీతారామపురం కూటమి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై ప్రజలలో అయోమయం నెలకొంది.
22 నుంచి ఉత్సవాలు జరిగేనా?
శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభించి మార్చి 02వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారా? లేక వేడుకలకు మంగళం పాడతారా? అని భక్తులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినానికి నెల రోజుల నుంచి హడావిడి ఆరంభమయ్యేది. అన్ని శాఖల అధికారులతో డివిజనల్ స్థాయి( ఆర్‌డీఓ లేక సబ్ కలెక్టర్) అధికారి సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారు. అత్తిరాలను ఉన్నతాధికారులు సందర్శించి దేవాదయశాఖతో సమన్వయం చేసుకని ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది ఈ వాతావరణం కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.
సౌకర్యాల ఊసే లేదు
శివరాత్రి మహోత్సవాలకు దాదాపు 7 నుంచి 15 రోజుల ముందు వాహనాల గేటుకు ఎంపీడీఓ ఆద్వర్యంలో వేలంపాట నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకూ వేలం వేయక పోవడం వెనుక అంతర్యమేమిటో అర్థంకాక భక్తులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు రాజంపేట–నెల్లూరు ప్రధాన రహదారిలోని అత్తిరాల ముఖ ద్వారం వద్ద నుంచి త్రేతేశ్వర దేవస్థానం వరకు రోడ్డు సమస్య పీడించేది. కమ్మపల్లిలో మాత్రం కొంత దూరం సిమెంటు రహదారి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సిమెంటు రోడ్డు ప్రారంభించాలని తలపెట్టినా అర్ధంతరంగా కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో రహదారికి ఇరువైపులా గుంతలు, మట్టి దిబ్బలు అలాగే ఉన్నాయి. అత్తిరాలకు విచ్చేసే భక్తులకు పార్కింగ్ సమస్యలు తప్పవు. రహదారి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
లబోదిబోమంటున్న వ్యాపారులు
శివరాత్రి మహోత్సవాలలో చిరు అంగళ్లు ఏర్పాటు చేసుకొని జీవించాలనుకొనే వ్యాపారులు లబోదిబో మంటున్నారు. త్రేతేశ్వరుని దేవస్థానం సమీపంలో రహదారి నిర్మాణం అలాగే ఉండడంతో వ్యాపారులు అంగళ్లను ఏర్పరుచుకోనే వీలులేదు. ఇప్పటి నుంచే అంగళ్లు ఏర్పరుచుకోకుంటే అప్పటికప్పడు కష్టంగా ఉంటుంది. వాహనాలలో సమాగ్రీనీ తీసుకెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఎంతో నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్రేత్రేశ్వరస్వామి ఆలయంలో
కానరాని ఏర్పాట్లు
శివరాత్రి మహోత్సవాలపై అయోమయం
9 రోజుల వేడుకలకు మంగళమేనా?
అత్తిరాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం

ఉత్సవాలకు వేళాయె.. సందడి లేదాయె ?
Comments
Please login to add a commentAdd a comment