
దొరసానిపల్లెలో చోరీకి విఫలయత్నం
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని దొరసానిపల్లెలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. దొరసానిపల్లె సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉంటున్న భూమా రాజా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను బెంగళూరు నుంచి అప్పుడప్పుడూ దొరసానిపల్లెలోని ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు రాజా ఇంటి తాళాలు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకర్లు తెరవడానికి ప్రయత్నించగా అవి తెరుచుకోలేదు. దుండగులు చేసేదేమిలేక వెనక్కి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి రాజాకు సమాచారం తెలియజేశారు. ఈ మేరకు రూరల్ సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ వెంకటసురేష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటి ఊళ్లకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. పోలీసులకు తెలిపితే ఎల్‌హెచ్‌ఎంస్‌తో పనిచేసే నిఘా కెమెరాలను వారి ఇంట్లో ఏర్పాటు చేయిస్తామన్నారు. చోరీల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఐ కోరారు.
రేపు వామపక్షాల సదస్సు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజా వ్యతిరేక పొలిటికల్ బడ్జెట్‌ను నిరసిస్తూ ఈ నెల 20 వామపక్షాల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. నగరంలోని రామకృష్ణ నగర్‌లో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొలిటికల్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. 70 శాతం అణగారిన ప్రజలను విస్మరించారని, మధ్య తరగతి ప్రజలను భ్రమలకు గురిచేసే విధంగా ఉందని తెలిపారు. గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారన్నారు. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలకు ముందు భ్రమలకు గురి చేసే బడ్జెట్ ప్రవేశపెట్టారని, కార్పొరేట్ల పెరుగుదలకు 42 శాతం ప్రజాధనాన్ని దోచిపెట్టే విధంగా అంకెల గారడి ఉందన్నారు. ప్రాజెక్టులు, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు, దీర్ఘకాలిక అభివృద్ధికి నిధులు విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో అన్వేష్, రామ్మోహన్, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.
చిరుత సంచార ప్రాంతాల్లో సీసీ కెమెరాలు
పులివెందుల రూరల్ : చిరుత, వాటి పిల్లలు సంచరించే ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల చిరుత సంచారం గురించి వివిధ గ్రామాల ప్రజలు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆయన కడప జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్‌కు ఫోన్ చేసి చిరుత సంచరిస్తున్న గ్రామాలలో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. స్పందించిన అధికారులు మంగళవారం నల్లపురెడ్డిపల్లె, సింహాద్రిపురం, లింగాల మండలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా చిరుత సంచారం, అడుగుజాడలు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని అటవీ అధికారులు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ మానవత్వం
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వెదుర్ల బజారుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి (71) గతంలో కూరగాయల మార్కెట్‌లో పనిచేశారు. మంగళవారం వెంకట సుబ్బారెడ్డికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన భార్య రామసుబ్బమ్మ అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేర్చే లోపే ఆయన చనిపోవడంతో ఇంటికెలా తీసుకెళ్లాలో తెలియక రోదిస్తూ ఉండిపోయింది. పోలీస్ ఔట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్‌బాషా విషయం తెలుసుకుని ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించి మృతదేహాన్ని ఇంటికి పంపించడంతోపాటు, అవసరమైతే హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిపిస్తానని ఆమె తెలిపారు. షబ్బీర్‌బాషా మానవత్వాన్ని పలువురు అభినందించారు. వెంకటసుబ్బారెడ్డికి ఇద్దరు కుమారులుండగా ఒకరి మానసికస్థితి బాగాలేదు. మరో కుమారుడు ప్రైవేట్ బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.
ట్రాలీ కింద పడి మహిళ మృతి
రాజుపాళెం : మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన దారాల ఆరోగ్యమ్మ (52) ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మంగళవారం మృతి చెందినట్లు రాజుపాళెం ఎస్‌ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో శనగ పంట కోతకు వెళ్లిన ఆరోగ్యమ్మ పొలం వద్దనే ఉన్న ట్రాక్టర్ ట్రాలీ వద్ద సేద తీరుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ తోలడంతో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ట్రాలీ కింద పడిన ఆరోగ్యమ్మకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. మృతురాలి కుమారుడు దారాల చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. శవాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

దొరసానిపల్లెలో చోరీకి విఫలయత్నం

దొరసానిపల్లెలో చోరీకి విఫలయత్నం

దొరసానిపల్లెలో చోరీకి విఫలయత్నం
Comments
Please login to add a commentAdd a comment