
వంక స్థలం ఆక్రమణ
కడప టాస్క్‌ఫోర్స్ : ప్రభుత్వ స్థలాలు అప్పనంగా కాజేస్తున్నా.. ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దవటం మండలం దిగువపేట నందు బద్వేల్ రోడ్డు ప్రక్కనే ఉన్న రూ.50 లక్షల విలువైన స్థలం ఆక్రమణకు గురైంది. దిగువపేట పెద్ద కుమ్మరి గుంతకు ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు స్థానిక మండల నేతల అండదండలతో దౌర్జన్యంగా చదును చేసి ముళ్ల కంచె వేశారు. సుమారు 0.43 సెంట్ల స్థలాన్ని దిగువపేట గాంధీ నగర్ హరిజనవాడ ప్రజలు కర్మ కాండలకు వినియోగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ ఇక్కడే చేసుకుంటారు, భర్త చనిపోయిన మహిళలకు ఇక్కడే వితంతువుగా మారుస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది కొంత ప్రభుత్వ భూమిగా, మరి కొంత వంకపొరంబోకుగా ఉంది. ఈ వంకపై ప్రభుత్వం ఒక మోరీ గతంలో నిర్మించింది. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఈ వంకను నామరూపాలు లేకుండా చేశారు. బద్వేల్ మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న విలువైన స్థలాన్ని చదును చేసి ఆక్రమిస్తుంటే కూతవేటు దూరంలో ఉన్న రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం ఏమిటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు వారు గుసగుసలాడుతున్నారు. కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని టీడీపీ కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం
ఆక్రమించింది
టీడీపీ నేత కావడమే కారణం
Comments
Please login to add a commentAdd a comment