
తూతూ మంత్రం.. రాయితీరుణం
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 300 మందికి మాత్రమే రాయితీపై రుణాలు మంజూరుచేయడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు లక్షల జనాభా గల నియోజకవర్గంలో 300 యూనిట్ల సబ్సిడీ రుణాలు మంజూరుకాగా, 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 300 మందిని ఎంపిక చేస్తే మిగిలిన 2,700 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 60 వేల ఓటర్లు గల చేనేతలకు 40, 20 వేల ఓటర్లు గల యాదవులకు 15, ఆర్య వైశ్యులకు 2, బ్రాహ్మణులకు 1 చొప్పున రుణాలు మంజూరుచేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సిఫారసు చేసిన వారికే రుణాలు వస్తాయని, ఒక్కో రుణానికి ఆయా వార్డుల శ్రేణులు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అర్హతే ప్రామాణికంగా దళారీ వ్యవస్థ లేకుండా రూ.2.72 లక్షల కోట్లు మంజూరుచేశారన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఎంపీపీలతోపాటు ఏ నాయకుల పాత్ర ఎంపికలో లేదన్నారు. జగన్‌న బటన్ నొక్కితే అర్హత ఉన్న వారి ఖాతాకు డబ్బు వచ్చేదన్నారు. సచివాలయాల ఉద్యోగుల నియామకానికి, మంత్రుల పలుకుబడి కూడా పనిచేయలేదని, నిజాయితీగా ఉద్యోగులను ఎంపిక చేశారన్నారు. పాలిచ్చే ఆవును వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్న చందాన ప్రజల పరిస్థితి ఉందన్నారు. 300 మందికి అన్న క్యాంటీన్‌లో భోజనం పెట్టి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గుంతలు పూడ్చి హైవే రోడ్లను నిర్మించినట్లు చెబుతున్నారన్నారు. ప్రభుత్వ పాలన చూస్తే 11 సీట్లు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, పాతకోట వంశీధర్‌రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, గుర్రం లావణ్య, చౌడం రవీంద్ర, దేస్ రామ్మోహన్‌రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment